కరోనా ముంచుకొస్తోంది.. మరో లాక్‌డౌన్‌కి సిద్ధమవ్వాల్సిందే.!

Get ready for another lockdown

Get ready for another lockdown

ప్రపంచ వ్యాప్తంగా జన జీవనం కొన్ని రోజులపాటు స్థంభించిపోతుందని ఎవరైనా ఊహించారా.? లేనే లేదు. కానీ, కరోనా వైరస్ రూపంలో ప్రపంచ మానవాళికి అనూహ్యమైన దెబ్బ తగిలింది. మన భారతదేశం విషయానికొస్తే, రాత్రికి రాత్రి ‘లాక్‌డౌన్’ అనేసింది కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్. ఏడాది క్రితం ఈ సమయానికి కరోనా పట్ల భయం వుందిగానీ, లాక్‌డౌన్ గురించి పెద్దగా చర్చ లేదు. కానీ, లాక్‌డౌన్ వచ్చేసింది.. జనాన్ని అతలాకుతలం చేసిపారేసింది. ఎలాగైతేనేం, లాక్‌డౌన్ నుంచి క్రమక్రమంగా సడలింపులు.. చివరికి పూర్తిగా లాక్‌డౌన్ ఎత్తివేత కొన్ని నెలల తర్వాత జరిగింది. మళ్ళీ ఇంకోసారి దేశం లాక్‌డౌన్ మోడ్‌లోకి వెళ్ళక తప్పలేదు. అయితే, ఈసారి కూడా ఆలస్యం చేసి, పెను విపత్తుని జనమ్మీద పాలకులు రుద్దబోతున్నారా.? అన్న అనుమానాలైతే కలుగుతున్నాయి.

మహారాష్ట్రలోని నాగ్‌పూర్ కరోనా హాట్ స్పాట్ అయి కూర్చుంది. దాంతో అక్కడ వారం రోజులపాటు పూర్తిస్థాయి లాక్‌డౌన్ కోసం ప్రకటన వచ్చేసింది. ఇక, దేశంలోని మరికొన్ని రాష్ట్రాల్లోనూ కేసులు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20 వేలు దాటి, 25 వేలను టచ్ చేస్తోంది. ఒక్క మహారాష్ట్రలోనే దేశంలో నమోదవుతున్న కేసుల్లో సగానికి పైగా నమోదవుతుండడం గమనార్హం. మహారాష్ట్రతో సరిహద్దు కలిగిన రాష్ట్రాల్లో భయాందోళనలు పెరిగిపోతున్నాయి. ఓ పక్క ఛిన్నాభిన్నమైపోయిన దేశ ఆర్థిక వ్యవస్థ, చితికిపోయిన సామాన్యుడి బతుకు.. వెరసి ఇంకోసారి లాక్‌డౌన్ విధించాల్సి వస్తే.. ఆ పరిస్థితి ఎంత భయానకంగా వుంటుందో ఏమో.! లాక్‌డౌన్ సడలింపుల విషయంలో సరైన ప్రణాళిక పాలకులకు లేకపోవడం, అదే సమయంలో ప్రజల్లో పెరిగిపోయిన బాధ్యతారాహిత్యమే.. కరోనా సెకెండ్ వేవ్‌కి కారణంగా చెప్పుకోవచ్చు.