కరోనాకి మందు కనిపెట్టే ప్రయత్నాల్లో ప్రపంచ దేశాలన్ని తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయినా ఇప్పటివరకూ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. పరీక్షలు జరుగుతున్నా అవి పూర్తి స్థాయిలో సత్ఫలితాలివ్వవడం లేదు. దీంతో వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందో? చెప్పలేమని అప్పటివరకూ జాగ్రత్తగా ఉంటూ కరోనాని ఎదుర్కోవడం ఒక్కటే మార్గమని డబ్లూ హెచ్ ఓ సైతం చెప్పేసింది. అయితే భారత్ లో మాత్రం కరోనాకి మందు వచ్చేసిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తమ పరీక్షలలో మంచి ఫలితాలు వచ్చాయని ఓ రెండు కంపెనీలు మాత్రల్ని, ఇంజెక్షన్ రిలీజ్ చేయడానికి రెడీ అయ్యాయి. ఈ రెండింటికీ ప్రభుత్వం అనుమతులు కూడా దొరికాయి.
అందులో మాత్ర రూపంలో ఉండేది కేవలం కరోనా ఆరంభం దశలో మానవ శరీరంలో వైరస్ ప్రభావం సీరియస్ గా లేనప్పుడు పనిచేస్తుందని…వైరస్ ముదిరితే మాత్రం మాత్ర పనిచేయదని ముందుగానే చెప్పేసింది. ఇక జెనరిక్ ఇంజెక్షన్ ని హైదరాబాద్ కు చెందిన హెటిరో కంపెనీ తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. సూది మందు రూపంలో ఇది మార్కెట్ లోకి రానుంది. 100 గ్రాములుండే ఈ సూది మందు ధర అక్షరాల 5400 రూ..లు. తొలి విడతగా 20 వేల వయోల్స్ అందుబాటులోకి రానున్నాయి. 10 వేల వయోల్స్ ని ముందుగా కొవిడ్ కేసులు అధికంగా ఉన్న తమిళనాడు, మహరాష్ర్ట, గుజరాత్, ఢిల్లీ రాష్ర్టాలకు పంపిణీ చేస్తారు.
ఇక రెండవ బ్యాచ్ లో మరో 10 వేలవయోల్స్ ని కోల్ కత్తా, ఇండోర్ , పాట్నా, భువనేశ్వర్, రాంచీ, గోవా, విజయవాడ తదితర ప్రాంతాలకు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. అయితే ఈ మాత్రల్ని, సూది మందుని కరోనా ప్రభావం అధికంగా ఉన్న వారికి, చివరి స్టేజ్ లో అందిస్తున్నట్లు తెలుస్తోంది. వీలైనంత వరకూ సాధారణ జ్వరానికి ఇచ్చే మందులే ఇస్తున్నారు. వాటితోనే నయం చేసి పంపిస్తున్నారు. తాజాగా వచ్చిన కొత్త మందులు మంచి ఫలితాలు ఇస్తాయని డాక్టర్లు ఆశిస్తున్నారు. అదే జరిగితే భారత్ కరోనాని జయించినట్లే.