కరోనా భయం: రెండోదే ఇలా వుంటే, మూడోది ఇంకెలా వుంటుందో.!

Corona Mania

Corona Mania

కరోనా వైరస్ పట్ల భయపడొద్దు.. బాధ్యతగా మెలగండి..’ అని ప్రభుత్వాలు చెబుతున్నాయి. వైద్య నిపుణులూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజానికి, బాధ్యత తెలియాలంటే భయపడాల్సిందే. భయపడవద్దు.. కరోనా వ్యాప్తి నివారణ కోసం ప్రభుత్వాలు అన్ని చర్యలూ చేపడుతున్నాయనే ప్రచారం జరుగుతున్నప్పుడు, జనం ఎలా భయపడతారు.? సరే, ఆ సంగతి పక్కన పెడితే, ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించడం మానేశాయి. ప్రజల్లో కొందరు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.. కొందరు మాత్రం లైట్ తీసుకుంటున్నారు. ఆ కొందరి కారణంగా, మొత్తం దేశం ప్రమాదంలో పడింది. రెండో వేవ్ ఇంత భయానకంగా వుంటుందని ఎవరూ ఊహించలేదు.

ప్రభుత్వాలకు ముందే ఓ అంచనా ఏర్పడినా, ప్రజల్ని అప్రమత్తం చేయడంలో విఫలమయ్యాయి. ప్రభుత్వాలు ముందే తేరుకుని, ప్రజల్ని అప్రమత్తం చేసి వుంటే, దేశంలో ఇప్పుడీ దుస్థితి వచ్చి వుండేదే కాదు. నిజానికి, సెకెండ్ వేవ్ అప్పుడే అయిపోలేదు. ఏ రోజుకి ఆ రోజు సరికొత్త రికార్డుల్ని చూస్తున్నాం కొత్త కేసుల పరంగా. ఇంతలోనే, మూడో వేవ్ అనివార్యం.. అంటోంది కేంద్రం. అయితే, అదెప్పుడో చెప్పలేం.. అన్నది కేంద్రం పేల్చిన ఇంకో బాంబు. అంటే, మహమ్మారి మళ్ళీ విరుచుకుపడుతుంది, మీ ఛావు మీరు ఛావండి.. అన్నట్టే కదా. యుద్ధ విమానాల్లో ఆక్సిజన్ సిలెండర్లు వస్తున్నాయి.. యుద్ధ నౌకల్నీ సహాయ కార్యక్రమాల కోసమే వినియోగిస్తున్న పరిస్థితి. నిజానికి, దేశం ఇప్పుడు యుద్ధం చేయాల్సి వస్తోంది కరోనా వైరస్ అనే మహమ్మారితో. అంటే ఇది ఎమర్జన్సీ లాంటిదే. అయినాగానీ, కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు ఎమర్జన్సీ తరహాలో వైద్య సేవలు అందిచడానికి, ప్రైవేటు ఆసుపత్రుల్ని తమ ఆధీనంలోకి తీసుకోలేకపోతున్నాయి. లక్షలు కడితేగానీ, ఆసుపత్రుల్లో అడ్మిషన్ దొరకని పరిస్థితి. ‘ఆల్ ఈజ్ వెల్..’ అంటూ ప్రభుత్వాలు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తుండడం శోచనీయం.