తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ లో కరోనా కలకలం మొదలైన సంగతి తెలిసిందే. ప్రగతి భవన్ లో పనిచేస్తోన్న ఐదుగురికి కరోనా పాజిటివ్ వచ్చిందని నిన్ననే ఓ వార్త వెలుగులోకి వచ్చింది. వారంతా ఐసోలేషన్ లో ఉన్నట్లు..ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ హుటాహుటిన సిటీకి దూరంగా ఉన్న గజ్వేల్ లో తన సొంత నివాసంలో ఉన్నట్లు తెలిసింది. అయితే ప్రగతి భనలో కరోనా కేసులు ఐదు కాదు..30 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. అన్ని విధాల జాగ్రత్తలు తీసుకున్నా మహమ్మారి ప్రగతి భవన్ లోకి ఎలా ప్రవేశించిందన్నది ఆసక్తికరంగా మారింది.
ఇక్కడ సిబ్బందిలో ఎవరూ నేరుగా కొవిడ్ బారిన పడలేదు. బయటతిరిగి ప్రగతి భవన్ లోకి వచ్చే ఉన్నతాధికారుల ద్వారానే వైరస్ లోపలికి ప్రవేశించినట్లు తొలుత భావించారు. కానీ అసలు సంగతి అదికాదుట. సీఎం నిర్వహించే కార్యక్రమాలు, సమీక్షలకు హాజరయ్యే ప్రజా ప్రతినిధులకు భోజనం, స్నాక్స్ అందించేందుకు ఓ కేటరింగ్ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారు. కరోనా అక్కడ నుంచి అంటుకుందని తాజాగా భావిస్తున్నారు. ఆ సంస్థకు చెందిన ఏడుగురి మహమ్మారి సోకిందిట. ఈ విషయం తెలిసేలోపే ఇతరులకు వ్యాపించినట్లు అధికారులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి భద్రతా విభాగం కీలక అధికారికి కూడా కరోనా నిర్ణారణ అయింది.
సీఎం కారు నడిపే డ్రైవర్, ఇతర వ్యక్తిగత సిబ్బంది కూడా వైరస్ బారిన పడినట్లు తెలిసింది. దీంతో సీఎం కేసీఆర్ ఫ్యామిలీ లో కరోనా టెన్షన్ మొదలైనట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. మరోవైపు సీఎం కేసీఆర్ కు కూడా కరోనా అంటుకుందా? అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అందుకే కేసీఆర్ హుటాహుటిన గజ్వేల్ కు పయనమైనట్లు తాజాగా కథనాలు వేడెక్కిస్తున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇక గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 1892 పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 8 మంది మృత్యువాతపడ్డారు.