Corona Cases in India: భారత్ లో కరోనా కల్లోలం.. ఒక్కరోజులోనే ఇన్ని కేసులా.!

Corona Cases in India: భారత్ మరోసారి కరోనా కల్లోలంలో చిక్కుకుంది. దేశంలో కరోనా కేసులు విలయతాండవం చేస్తున్నాయి. తాజా గా వచ్చిన కరోనా వేరియంట్ ఒమిక్రాన్‌ దెబ్బకు కరోనా కేసులు ఒక్కసారిగా జెట్ స్పీడ్‌తో దుసుకుపోతున్నాయి.

తాజాగా గడిచిన 24గంటల్లో భారత్‌లో 16 వేల 500లకుపైగా కేసులు నమోదయ్యాయి. ఇది అంతకముందు రోజు కంటే 27శాతం ఎక్కువ. ఈ మూడు రోజుల్లోనే కరోనా కేసుల 2.6శాతం మేర పెరగడం వలన ప్రజలలో ఆందోళన కలిగిస్తోంది.

మొన్న 9 వేల కేసులు, నిన్న 13 వేల కేసులు, ఇవాళ 16 వేల కేసులు… ఇలా రోజురోజుకు కరోనా వేగం పెంచుకుంటుపోతోంది. పరిస్థితి ఇలానే కొనసాగితే మరో వారంలోనే కరోనా పీక్‌ స్టేజ్‌కు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. అంతేకాకుండా అటు మెట్రో నగరాలపై కరోనా పంజా విసిరింది. ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత దేశంలోని ఐదు మెట్రో నగరాల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. కోల్‌కతాలో ఐతే అంతకముందు రోజుతో పోల్చితే 102శాతం మేర కేసులు రికార్డయ్యాయి. నిన్న 540 కరోనా కేసులు నమోదవగా.. ఇవాళ ఆ సంఖ్య దాదాపు 11వందలకు చేరింది.

ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం ఒమిక్రాన్‌ కేసుల కట్టడికి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. యూకే నుంచి కోల్‌కతాకు వచ్చే విమానాలపై సస్పెండ్ విధించింది. అటు ఢిల్లీలో 24గంటల్లో 13వందల కరోనా కేసులు రికార్డయ్యాయి. ఏడు నెలల తర్వాత కరోనా కేసుల సంఖ్య వెయ్యి మార్కును దాటింది. మే 26 తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే మొదటిసారి.

అటు మహానగరం ముంబైలో అత్యంత తీవ్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్క ముంబైలోనే 3వేల 6వందలకు పైగా కోవిడ్ కేసులు బయటపడ్డాయి. ఇది ముందురోజుతో పోల్చితే 47శాతం ఎక్కువ. కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు బృహన్‌ ముంబై మునిసిపల్‌ కార్పొరేషన్‌ చర్యలు చేపట్టింది. వార్డు-స్థాయి వార్ రూమ్‌లను తిరిగి యాక్టివ్ చేసింది. ముంబైలో ఇప్పటికే న్యూయిర్‌ వేడుకలపై మున్సిపల్‌ కార్పొరేషన్‌ నిషేధం విధించింది. వైరస్‌ వ్యాప్తిని నిలువరించడానికి మహానగరంలో పోలీసులు 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు.