Covid 19 Omicron : కోవిడ్ 19 ఒమిక్రాన్.. అది నమ్మితే నట్టేట్లో మునగాల్సిందే.!

Covid 19 Omicron : దేశంలో కొత్తగా నమోదవుతున్న కోవిడ్ 19 కేసుల్లో చాలావరకు ఒమిక్రాన్ వేరియంట్ వల్ల సంభవిస్తున్నవేనంటూ ఓ వైపు వైద్య నిపుణులు చెబుతున్నారు. వివిధ ప్రభుత్వాలు కూడా చూచాయిగా సంకేతాలు పంపుతున్నాయి. ఆసుపత్రుల్లో చేరికలు తక్కువగా వుంటున్నాయి కాబట్టి, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్య నిపుణులు ఒకింత ‘భయాల్ని తగ్గించే’ ప్రయత్నం చేస్తున్నారు.

నిజమే, ఆశ క్యాన్సర్ వున్నోడ్ని బతికిస్తుంది.. భయం అల్సర్ వున్నోడిని కూడా చంపేస్తుందంటారు. ఒమిక్రాన్ పట్ల భయపడకూడదు.. కానీ, అప్రమత్తంగా వుండాలి. కోవిడ్ మొదటి వేవ్, రెండో వేవ్ సమయంలోనూ కొందరు వైద్య నిపుణులు ఇలాగే ప్రజలకి ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేశారు.

కానీ, ఇలా ధైర్యం నూరి పోసే ప్రక్రియ కొందరికి చులకనగా మారిపోతోంది. ఒమిక్రాన్ వల్ల ప్రమాదమేమీ లేదట. లక్షల్లో కేసులు వచ్చినా ఇబ్బంది ఏమీ వుండదట.. అంటూ జనం విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు. ప్రభుత్వాలేమో మాస్క్ వేసుకోకపోతే జరీమానా, కోవిడ్ నిబంధనలు పాటించకపోతే జరీమానా.. అని చెబుతూ, జనాన్ని ‘పిండేయడానికి’ సమాయత్తమైపోయాయి.. అంతే తప్ప, కోవిడ్ 19 ఒమిక్రాన్ పట్ల అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టడంలేదు.

అమెరికాలో వ్యాక్సినేషన్ చాలావరకు జరిగిపోయినా, అక్కడ బూస్టర్ డోసు కూడా ఇప్పటికే చాలామంది తీసుకున్నా రోజుకి 7 నుంచి 10 లక్షల కొత్త కోవిడ్ 19 పాజిటివ్ కేసులు (అన్నీ ఒమిక్రాన్ వేరియంట్ కేసులే) నమోదవుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాతో పోల్చితే, భారతదేశంలో వైద్య సౌకర్యాలు చాలా తక్కువ. వైద్యులూ తక్కువే.

పెద్దయెత్తున వైద్యులు కూడా కోవిడ్ బారిన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో కోవిడ్ కేసులు లక్షల్లో నమోదవడమంటే, అది అత్యంత ప్రమాదకరమైన విషయం. ‘తేలిక ప్రచారం’ దేశానికి పెను ప్రమాదాన్ని తెచ్చిపెట్టనుంది గనుక, స్వీయ జాగ్రత్తలు పాటించడమే ఎవరికైనా సురక్షితం. కోవిడ్ సెకెండ్ వేవ్ సందర్భంగా దాదాపు ప్రతి ఒక్కరూ తమ ఆప్తుల్ని కోల్పోయారు. ఆ భయం, బాధ్యత ఓసారి గుర్తు చేసుకుంటే తప్ప, ప్రజలు అప్రమత్తంగా వుంటే తప్ప, కోవిడ్ మూడో వేవ్ నుంచి బయటపడలేం.