ఎంపీ రేవంత్ రెడ్డి.. దూకుడు ఎక్కువ. ఎదుటి వాళ్లు ఎంతటి వాళ్లు అయినా సరే.. తప్పు చేశారని తెలిస్తే వెంటనే ఆరోపణలు చేస్తారు. ఏమాత్రం ఆలోచించరు. తన దుందుడుకు స్వభావంతో టీడీపీ నుంచి బయటపడి.. కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ లోనూ తన పార్టీ నేతలపైనా అప్పుడప్పుడు రేవంత్ ఆరోపణలు చేస్తుంటారు.
తాజాగా ఎంపీ రేవంత్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై పడ్డారు. నిజానికి తెలంగాణ సీఎం కేసీఆర్ కు, రేవంత్ రెడ్డికి పడదు అనే విషయం అందరికీ తెలిసిందే. వాళ్లిద్దరి మధ్య వైరం ఇప్పటిది కాదు.. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఉన్నదే. కానీ.. మధ్యలో ఏపీ సీఎం జగన్ ఏం చేశారు. ఆయనపై ఎందుకు రేవంత్ ఆరోపణలు చేస్తున్నారు.. ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.
ముందుగా కేసీఆర్ ను ఏమన్నారో మాట్లాడుకొని.. ఆ తర్వాత జగన్ దగ్గరికి వెళ్దాం. కేసీఆర్ నైజాన్ని తెలంగాణ ప్రజలు తెలుసుకుంటున్నారు. ఉద్యమకారులంతా కేసీఆర్ చేతిలో అణచివేతకు గురయ్యారు. ఉద్యమకారులను కేసీఆర్ పక్కన పెట్టి.. పెట్టుబడిదారులకు టికెట్లు ఇచ్చారు. ఉద్యమకారులను తరిమికొట్టిన తలసానికి మంత్రి పదవి ఇచ్చారు. ఆయన కొడుకుకు ఎంపీ టికెట్ ఇచ్చారు. ప్రతిపక్షాల హక్కులను కూడా సీఎం కేసీఆర్ ధ్వంసం చేస్తున్నారు. తెలంగాణకు నేను కాపలా కుక్కలా ఉంటా.. అని నమ్మబలికిన కేసీఆర్ ఇప్పుడు ఏం చేస్తున్నారు. తెలంగాణకు శాశ్వత విముక్తి కోసం తుది దశ పోరాటం జరగాలి. నాకు ఏ పదవీ వద్దు. పదవులు ఉన్నా లేకున్నా… తెలంగాణ విముక్తి కోసం.. పోరాటం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ప్రొఫెసర్ కోదండరామ్ రాజకీయ పార్టీ పేరుతో ఏం చేయలేడు. రాజకీయాలకు అతీతంగా ఓ వేదికను ఏర్పాటు చేయాలి. కేసీఆర్ ను గద్దె దించితేనే రాష్ట్రంలో పరిస్థితి మారుతుంది.. అంటూ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు.
అక్కడితో ఆగకుండా.. ఏపీ సీఎం జగన్ పై కూడా తన విమర్శనాస్త్రాలను సంధించారు రేవంత్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు అచ్చం రాజశేఖర్ రెడ్డి లాగానే పనిచేస్తారని చెప్పారు కదా. వైఎస్ఆర్ పోతిరెడ్డిపాడుకు బొక్క పెట్టారు. జగన్ దాన్ని ఇంకాస్త పెద్దదిగా చేస్తున్నారు. కృష్ణా బేసిన్ నుంచి తెలంగాణకు వస్తున్నది ఒక్క టీఎంసీనే. కానీ.. ఏపీ మాత్రం 12 టీఎంసీలను ఎత్తిపోసుకుంటోంది. పవర్ ప్రాజెక్టులను కూడా ఆపేసే కుట్ర జరుగుతోంది. పాత ప్రాజెక్టులన్నింటినీ మూసేసి.. కొత్త విద్యుత్ ప్రాజెక్టులను కట్టాలని ప్లాన్ చేస్తున్నారు.. అంటూ రేవంత్ రెడ్డి.. వైఎస్ జగన్ పై ఫైర్ అయ్యారు.