వైఎస్సార్‌పై కాంగ్రెస్ నేతల మొసలి కన్నీరు.!

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తాను నిఖార్సయిన శిష్యుడినని చెప్పుకున్నారు. నిజమే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కారణంగా రాజకీయాల్లో ఎదిగిన వారిలో ఆయనా ఒకరు. కానీ, వైఎస్సార్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసిన రాజకీయాల్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎందుకు వ్యతిరేకించలేకపోయారు.? వైఎస్సార్ అవినీతిపరుడు.. అంటూ కాంగ్రెస్ నేతలు చాలామంది చాలా రకాలుగా ఆరోపణలు చేస్తే, కనీసం కోమటిరెడ్డి వాటిని ఖండించలేకపోయారు. వైఎస్సార్ ఆత్మగా చెప్పబడే కేవీపీ రామచంద్రరావు కావొచ్చు, వైఎస్సార్ సన్నిహితుల్లో అతి ముఖ్యమైనవారిలో ఒకరైన ఉండవల్లి అరుణ్ కుమార్ కావొచ్చు.. వీరంతా నిన్న వైఎస్సార్ 12వ వర్ధంతి నేపథ్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని వైఎస్సార్‌తో తమకున్న సాన్నిహిత్యాన్ని చెప్పుకున్నారు.

వైఎస్ విజయమ్మ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయమ్మ ఆహ్వానం మేరకు ఆయా నాయకులు హాజరైనా, వారందరి చెప్పిన మాటల్ని వైఎస్సార్ అభిమానులు లైట్ తీసుకున్నారు. పైగా, వారి మీద సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ జరుగుతోంది. చిత్రమేంటంటే, ఏపీకి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. నిజానికి, వైఎస్ విజయమ్మ.. షర్మిల మాత్రమే కాదు, వైఎస్ జగన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరై వుండాలి. తెలంగాణలోని హైద్రాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమం కేవలం షర్మిల రాజకీయ భవిష్యత్తు కోసమేనా.? అన్న వాదనా లేకపోలేదు. ఈ కార్యక్రమ నిర్వహణ విషయంలో వైఎస్ విజయమ్మ సక్సెస్ అయ్యారా.? లేదా.? అన్న విషయాన్ని పక్కన పెడితే, వైఎస్సార్ మీద ‘లేని అభిమానాన్ని’ చాటుకునేందుకే ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.