తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు రోజురోజుకు ఒక కొత్త మలుపు తిరుగుతున్నాయి. నార్త్ లో ఉన్నట్టు ఇప్పుడు ఇక్కడ కూడా దేవుళ్ళ చుట్టూ రాజకీయాలు చెయ్యడం పార్టీలు ప్రారంభించాయి. మొన్న జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో కులాల, మతాల ప్రస్తావన పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు చర్చించారు. అయితే ఇప్పుడు ఏపీలో ఎప్పటి నుండి కులాల పేరిట, మతాల పేరిట రాజకీయాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆ గొడవలు తీవ్ర స్థాయి చేరుకున్నాయి. అయితే ఇప్పుడు ఒక కాంగ్రెస్ మహిళా నాయకులు టీడీపీ చంద్రబాబు నాయుడుపై చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసింది. అది కూడా బాబు పక్కన ఉంటూనే.
ఏపీ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ నేడు మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రజా సమస్యల పరిష్కారం పై పోటీ పడాల్సిన రాజకీయ పార్టీలు దేవుళ్ల చుట్టూ తిరుగుతున్నాయి అని ఆమె మండిపడ్డారు. బీజేపీ ఆడుతున్న దేవుడి ఆటలో వైసీపీ, టీడీపీ పావులుగా మారుతున్నాయి అని ఆమె అన్నారు.
రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులను అందరూ ఖండించాల్సిన విషయమే అని వెల్లడించారు. టీడీపీ, వైసీపీ, బీజేపీ నేతలు దేవుడిని కూడా ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు అని ఆమె విమర్శించారు.
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 150 వరకు దేవాలయాలపై దాడులు జరిగితే ప్రభుత్వం ఏం చేస్తుంది ? అని నిలదీశారు. దేవాలయాలపై బీజేపీనే దాడులు చేయించి కావాలనే నాటకం ఆడుతుందనే అనుమానం కలుగుతుంది అని అన్నారు. రాజకీయ ఆధిపత్యం కోసం వైసీపీ, టీడీపీ దిగజారి ప్రవర్తిస్తున్నాయి అని ఆరోపించారు. రైతులు , మహిళలు, కార్మికులు ఇలా ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం వారిని పట్టించుకోకుండా దేవాలయల రాజకీయం చేయడం ఏంటి ? అని ప్రశ్నించారు. బీజేపీ అడుతున్న నాటకంలో జగన్, చంద్రబాబు పాల్గొంటూ ప్రజలను మోసం చేస్తున్నారు అని అన్నారు.