దుబ్బాక ఉపఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పరువు తీశాయి. రాష్ట్ర స్థాయి నేతలంతా దుబ్బాకలో మకాం వేసి మరీ ప్రచారం చేసినా కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. కిందటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన ప్రతీ ఎన్నికల్లో ఓడుతూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ దుబ్బాకలో మూడో స్థానంలో నిలిచి ఆ ఓటమిని సంపూర్ణ చేసింది. దీంతో గాంధీ భవన్ కు ఇక తాళాలు వేయాల్సిందే అంటూ చాలా మంది సెటైరిక్ కామెంట్స్ చేస్తున్నారు.
దుబ్బాక ఉపఎన్నికల్లో కాంగ్రెస్ కనీసం పోటీ కూడా ఇవ్వకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దీంతో కాంగ్రెస్ భవిష్యత్ ప్రశ్నార్థకమైంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత ఏ రౌండ్ లోనూ కాంగ్రెస్ ఆధిక్యత కనపర్చకపోవడం అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసిన కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు రాష్ట్రంలో ఎవ్వరూ నమ్మడం లేదని తాజా ఎన్నికల ఫలితాలతో తేలిపోయింది. తెలంగాణ వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్రను సరిగ్గా పోషించకపోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
దుబ్బాక నియోజకవర్గంలో సరైన అభ్యర్థి కూడా లేకపోయినప్పటికీ మాజీ మంత్రి, దివంగత నేత చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాసరెడ్డిని ఒప్పించి ఆయన్ని కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దించారు కాంగ్రెస్ పార్టీ పెద్దలు. చెరుకు ముత్యంరెడ్డికి దుబ్బాక పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ మంచి ఆదరణ ఉంది. చనిపోయి చాలా కాలం అయినా ఇంకా ఆయన మంచితనాన్ని స్థానికులు మర్చిపోలేదు.
అయితే బీజేపీ రూపంలో వచ్చిన ఉపద్రవం నుంచి కాంగ్రెస్ తప్పించుకోలేకపోయింది. బీజేపీ బరిలోకి దిగడంతో క్షేత్ర స్థాయిలో రూపురేఖలే మారిపోయాయి. టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్న పోరు కాస్త…. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా మారిపోయింది. బీజేపీని కట్టడి చేసేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ చూయించిన అత్యుత్సాహం కూడా బీజేపీ వైపు ప్రజలను ఆకర్శించేలా చేసింది. ఓరకంగా చెప్పాలంటే సీఎం కేసీఆర్ తన సొంత జిల్లాలో తాను ఓడిపోయి…కాంగ్రెస్ ను భూస్థాపితం చేసినట్లు అయింది.
అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా మండలానికో నాయకుడికి బాధ్యతలు అప్పగించారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ ఠగూర్. ఇది కూడా వర్క్ అవుట్ కాలేదు. ఇన్నాళ్లూ టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనంటూ చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ ఇకపై ఏం చెప్పుకుంటుందని అంతా ప్రశ్నిస్తున్నారు. నాయకత్వ లేమితో కూనారిల్లి పోతున్న కాంగ్రెస్ పార్టీ ఇక తెలంగాణలో నిలదొక్కుకోవడం కష్టమేనని దుబ్బాక ఎన్నికలు మరోసారి రుజువు చేశాయి.