Confusion Over AP Capital : కేంద్రం, ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం నిధులు కేటాయించింది. దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయల్ని కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధానికి కేటాయించినట్లుగా వార్తలొస్తున్నాయి. నిజానికి, ఈ నిధుల కోసమే వైఎస్ జగన్ సర్కారు, మూడు రాజధానుల నిర్ణయాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టిందనే ప్రచారం గత కొద్ది రోజులుగా జరుగుతోంది.
సచివాలయం సహా, రాష్ట్ర రాజధాని నిర్మాణానికి సంబంధించి అవసరమైన కొన్ని భవనాల కోసం ఈ పన్నెండు వందల కోట్ల రూపాయల నిధుల్ని కేంద్రం కేటాయించగా, వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఎలా వాడుతుంది.? అన్నదానిపైనా భిన్నాభిప్రాయాలున్నాయి.
రాష్ట్రానికి ఏదో ఒక రాజధాని వుంటే, దానికే రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వుంటే.. ఆ రాజధాని పేరు చెప్పి కేంద్రాన్ని నిధులు అడగడానికి వీలుంటుంది. విభజన చట్టం ప్రకారం రాష్ట్ర రాజధానికి కేంద్రం సహకరించాలి. కానీ, ఎప్పుడైతే మూడు రాజధానుల నాటకం తెరపైకొచ్చిందో.. కేంద్రం కూడా తమకేంటి సంబంధమన్నట్టు లైట్ తీసుకుంది.
రాష్ట్రానికి ఒక్క రాజధాని కట్టుకోవడానికే దిక్కులేనప్పుడు, మూడు రాజధానులెలా కడతామన్న ఇంగితం అధికార పక్షంలో లేకపోవడమే ఇన్ని అనర్ధాలకూ కారణం. సరే, ఒకటంటూ పూర్తిస్థాయిలోనో, ఓ మోస్తరుగానో కట్టేసుకుంటే, ఆ తర్వాత మిగతా రెండు రాజధానుల గురించి ఆలోచించుకోవచ్చు.
అయ్యిందేదో అయిపోయింది.. రాష్ట్ర ప్రభుత్వం బేషజాలకు పోవాల్సిన అవసరం లేదు. అంతిమంగా రాష్ట్ర అభివృద్ధే ఎవరికైనా కావాల్సింది. రాజధానికి ఓ రూపు, రేఖ వుంటే.. అదే రాష్ట్రానికి జీవనాడిగా మారుతుంది.