Amaravati Struggle : ‘ఏకైక రాజధాని అమరావతి’ అంటూ గడచిన 800 రోజులుగా ఉద్యమం జరుగుతోంది. అమరావతి కోసం భూములిచ్చిన రైతులు, వారికి మద్దతుగా వివిధ రాజకీయ పార్టీలు ఈ ఉద్యమంలో పాల్గొంటున్నాయి. అయితే, అధికార వైసీపీ మాత్రం తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళన్న చందంగా, ‘మూడు రాజధానులతోనే అభివృద్ధి..’ అంటోంది.
ఒక్కదానికే దిక్కు లేదు.. మూడు రాజధానులెలా కడతారు.? అన్న ప్రశ్నకు అధికార పక్షం దగ్గర సరైన సమాధానం లేదు. అమరావతిని కూడా మూడు రాజధానుల్లో ఒకటిగా పేర్కొంటున్నప్పటికీ, ఆ అమరావతిని అభివృద్ధి చేయడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనిపించకపోవడం గమనార్హం.
అసలు అమరావతి విషయంలో వైఎస్ జగన్ సర్కారు వైఖరి ఏంటన్నది ఎవరికీ అర్థం కావడంలేదు. అధికార పార్టీ నేతల్లోనే ఈ విషయమై స్పష్టత లేదు. అమరావతిని ఎడారి అన్నారు, స్మశానం అన్నారు.. దాదాపు మూడేళ్ళుగా అదే అమరావతి నుంచి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. దాంతో,
ప్రభుత్వం పట్ల ప్రజల్లో విశ్వసనీయత పూర్తిగా మాయమవుతోంది.
2024 ఎన్నికల నాటికి అయినా, ఈ రాజధాని లేదా రాజధానుల సంక్షోభం ఓ కొలిక్కి వస్తుందా.? అంటే, చెప్పలేని పరిస్థితి. రైతుల ఉద్యమానికి తలొగ్గారో, లేదంటే.. న్యాయస్థానాల్లో ఎదురవుతున్న పరాభవాలతో కంగారు పడ్డారోగానీ, మూడు రాజధానుల చట్టాన్ని వైఎస్ జగన్ సర్కారు వెనక్కి తీసుకుంది.
కానీ, అతి త్వరలో.. వచ్చే బడ్జెట్ సమావేశల్లోనే మూడు రాజధానుల బిల్లు పెడతామంటోంది ప్రభుత్వం. బిల్లు పెట్టి, చట్టం చేసి ఏం సాధిస్తుంది.? అన్నదానిపై ప్రభుత్వ పెద్దలకే అవగాహన వున్నట్టు కనిపించడంలేదు. అమరావతి రైతుల్ని కాదని, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా..
అది చెల్లుబాటయ్యే పరిస్థితి లేదు.