దేశాన్ని కుదిపేసింది నిర్భయ ఘటన. దేశ రాజధానిలో ఓ యువతిపై కొందరు యువకులు అత్యంత పాశవికంగా అత్యాచారం చేశారు.. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు, ఆ తరువాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఆనాటి ఆ ఘటన ఇప్పటికీ ఒళ్ళు గగుర్పాటుకి గురిచేస్తుంటుంది. ఆ ఘటనతో మాజీ మంత్రి, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యను పోల్చగలమా.? నిర్భయ ఘటన విషయంలో ఎలాగైతే దేశమంతా స్పందించిందో, వైఎస్ వివేకా హత్య కేసు విషయంలోనూ అలాగే స్పందించాలని వైఎస్ వివేకా కుమార్తె సునీతా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రికి జరిగిన ఘోరంపై సునీతా రెడ్డి ఆవేదన వ్యక్తం చేయడాన్ని తప్పుపట్టలేం.
రెండేళ్ళయినా ఈ కేసులో దోషులెవరో తేలకపోవడమంటే, ఖచ్చితంగా ఇందులో రాజకీయ కుట్ర దాగి వుండాలన్నది సర్వత్రా వినిపిస్తోన్న అనుమానం. సునీతారెడ్డి కూడా తన తండ్రిది రాజకీయ ప్రేరేపిత హత్య.. అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సరే, ఏ కారణంతో హత్య జరిగింది.? అన్నది వేరే చర్చ. రెండేళ్ళయినా ఓ హత్య కేసులో దోషులెవరో తేలలేదంటే, అది కాస్త ఆలోచించాల్సిన విషయమే. దేశంలో వ్యవస్థలు సరిగ్గానే పనిచేస్తున్నాయా.? అన్న అనుమానం సామాన్యుడికి ఇలాంటి సందర్భాల్లోనే కనిపిస్తుంటుంది. చనిపోయింది సాదా సీదా వ్యక్తి కాదు.. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డకి సొంత బాబాయ్. మాజీ మంత్రి, మాజీ ఎంపీ.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగితేనే విచారణలో ఇంత జాప్యమంటే.. అసలు సామాన్యుడికి దేశంలో న్యాయం జరుగుతుందా.? అన్న సందేహాలు కలగడంలో వింతేముంది.? నిర్భయ తరహాలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయమై దర్యాప్తు సంస్థలు ప్రత్యేక చొరవ చూపితే తప్ప, కేసు మిస్టరీ ఇంకో రెండేళ్ళయినా వీడదు.