వకీల్ సాబ్’ సినిమాకీ, విద్యార్థుల పరీక్షలకీ లింకేంటి.?

Vakeel Saab and 10th Exams

Vakeel Saab and 10th Exams

తెలంగాణలో సినిమా థియేటర్లు మూతపడ్డాయి. ప్రస్తుతం ప్రదర్శితమవుతున్న ‘వకీల్ సాబ్’ సినిమాకి కాస్త వెసులుబాటునిచ్చారు. అయితే, ఆ వెసులుబాటు ప్రభుత్వం ఇచ్చింది కాదు. పైగా, థియేటర్లను మూసేయాలన్న నిర్ణయం కూడా ప్రభుత్వానిది కాదు. కొత్త సినిమాల రిలీజులకు ఆస్కారం లేకపోవడంతో సినీ పరిశ్రమ, థియేటర్ల యాజమాన్యాలు, పంపిణీదారులు కలిసి తీసుకున్న నిర్ణయమిది. ‘వకీల్ సాబ్’ సినిమా థియేటర్లకు వెళితే కరోనా నుంచి ఇమ్యూనిటీ వస్తుందా.? అన్న చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. ఆ సినిమా కూడా ప్రదర్శితం కాకూడదన్నది వారి డిమాండ్. నిజమే, థియేటర్లను మూసేయాలనే నిర్ణయం తెరపైకొచ్చాక, ‘వకీల్ సాబ్’ సినిమాకి మాత్రం ఎందుకు మినహాయింపు.? ఈ విషయంలో ఎవరి వాదన వారిది.

సినిమా థియేటర్లలో పది నుంచి 20 మంది కూడా వుండడంలేదని థియేటర్ల యాజమాన్యాలే చెబుతున్న దరిమిలా, ‘వకీల్ సాబ్’ కావొచ్చు, మరో సినిమా కావొచ్చు.. ప్రదర్శితమవడం వల్ల వచ్చే నష్టమేమీ లేదు. మరోపక్క, ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో థియేటర్ల విషయమై ఎలాంటి అభ్యంతరాలూ కన్పించడంలేదు. మధ్యలో 50 శాతం ఆక్యుపెన్సీ అక్కడ తెరపైకొచ్చింది. కాగా, ‘వకీల్ సాబ్’ సినిమా అంశాన్ని, ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల పరీక్షలతో ముడిపెడుతున్నారు కొందరు. సినిమా అనేది అత్యవసరం కాదు. అసలు అవసరం కూడా కాదు. అదొక వినోదం మాత్రమే. నచ్చినోడు వెళ్తాడు, భయమున్నోడు ఆగిపోతాడు. పరీక్షలు అలా కాదు. చచ్చినట్టు రాయాల్సిందే.. కరోనా వస్తే, విద్యార్థుల్ని చావు కూడా పలకరించొచ్చు.. పరిస్థితి అంత దారుణంగా వుంది. ‘మాకొద్దు బాబోయ్ ఈ పరీక్షలు’ అంటూ విద్యార్థులు సోషల్ మీడియా వేదికగా ఉద్యమం మొదలు పెట్టారు.

విద్యార్థుల సమస్య ఇక్కడ అత్యంత కీలకం. ఈ స్థాయి మానసిక సంఘర్షణతో విద్యార్థులు పరీక్షలు రాయలేరు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ ఇప్పటికే పరీక్షల్ని రద్దు చేశాయి పదో తరగతికి సంబంధించి. తెలంగాణలోనూ, పలు ఇతర రాష్ట్రాల్లోనూ పదో తరగతి పరీక్షలు రద్దయిన దరిమిలా, జగన్ ప్రభుత్వం కూడా ఆ దిశగా నిర్ణయం వీలైనంత త్వరగా తీసుకుంటే మంచిది.