సోము V/S సుజనా ఏపీ బీజేపీలో కోల్డ్ వార్

సోము వీర్రాజు ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికేనప్పటి నుంచి రోజు ఏదో వివాదం రాజుకుంటూనే ఉంది. టీడీపీ నుంచి బీజేపీలోకి వలస వచ్చిన నేతలకు ఈయన అస్సలు పొసగడం లేదు. తమకు వ్యతిరేకంగా అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్న సోము వీర్రాజుకు పూర్తి స్థాయిలో సహాయ నిరాకరణ చేయాలని టీడీపీలోంచి బీజేపీలోకి వచ్చిన వర్గం నిర్ణయించిందట. ఈమేరకు కేంద్రమాజీ మంత్రి సుజనచౌదరి తన వర్గానికి స్పష్టంగా తేల్చిచెప్పారట.  

ఏపీలో వైసీపీ, టీడీపీలకు ప్రత్యామ్నాయంగా ఎదగాలన్న ఉద్దేశ్యంతో సోము వీర్రాజు పనిచేస్తున్నారు. ఈ కారణంగా బీజేపీలో చేరిన సుజనా చౌదరి వర్గం పై దృష్టి పెట్టారు. దీంతో ఈరెండు వర్గాల మధ్య ఎత్తులకు పైఎత్తులతో ఏపీ బీజేపీలో ప్రచ్చన్నయుద్ధం కొనసాగుతోంది. ఈయన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సుజనా చౌదరి ప్రాధాన్యం తగ్గిపోయింది. చివరకు ఆయన అనుచరులు కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది. సుజనాకు, అత్యంత సన్నిహితుడైన లంకా దినకర్‌ను సోము వీర్రాజు పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు. దీనికి తోడు బీజేపీ అధిష్టానానికి ఎప్పటికప్పుడు సుజనాచౌదరిపై ఫిర్యాదులు చేస్తున్నారట. టీడీపీ కోవర్టులుగా బీజేపీలో కొనసాగుతున్నారని వీరి వల్ల పార్టీకి ఎప్పటికైనా నష్టమేనని చెబుతున్నారట. బీజేపీలోనే వుంటూ, బీజేపీకే వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారని పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారట. సుజన వర్గం చేస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను సీల్డ్ కవర్ లో పెట్టి పార్టీ అధిష్టానానికి అందించారట సోము వీర్రాజు. ఇప్పుడు ఈరిపోర్టు బీజేపీలో అలజడి సృష్టిస్తోంది.

 టీడీపీ నుంచి వచ్చిన వాళ్లందరినీ పార్టీ నుంచి పంపిచ్చేస్తే ఏపీలో బీజేపీ సులువుగా బలపడుతుందని చెప్పారట. దీంతో రాజ్యసభ సభ్యత్వ పదవీ కాలం ముగిసిన తర్వాత వీరిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ అధిష్టానం భావిస్తోందని టాక్. చూడాలి మరి ఈరెండు వర్గాల మధ్య ఏం జరుగుతుందో.