Sujana Chowdary : సుజనా చౌదరి అవకాశవాదం.. అప్పుడలా! ఇప్పుడిలా.!

Sujana Chowdary : మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో వున్నారు. అయినాగానీ, ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి అత్యంత సన్నిహితుడు. 2019 ఎన్నికల తర్వాత రకరకాల కేసులు చుట్టుముట్టడంతో ఒత్తిడి తట్టుకోలేక టీడీపీని వదిలి బీజేపీలోకి వెళ్ళారు.. అదీ రాజకీయంగా ఆత్మరక్షణ కోసమన్న విమర్శలున్నాయి.

అదేంటో, బీజేపీలో చేరాక ఆయనపై విచారణలు అలా అలా సా….గుతున్నాయ్.! ఇక, టీడీపీ – బీజేపీ మధ్య సఖ్యత వున్నప్పుడు, కేంద్ర మంత్రిగా పనిచేశారు సుజనా చౌదరి. అప్పట్లో ప్రత్యేక హోదా కోసం నినదిస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చారు. ఎప్పుడైతే బీజేపీ – టీడీపీ మధ్య తెగతెంపులు జరిగాయో, ప్రత్యేక హోదా కోసమంటూ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు సుజనా చౌదరి.

టీడీపీ నుంచి రాజ్యసభకు ఎంపికై, ప్రస్తుతం బీజేపీ నేతగా కొనసాగుతున్న సుజనా చౌదరి, ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమంటున్నారు. ఏపీలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వానికి చిక్కులు ఎదురవుతాయంటూ చిత్ర విచిత్రంగా మాట్లాడుతున్నారు. ‘కేంద్రం అన్నీ గమనిస్తోంది.. రాష్ట్రంలో పరిస్థితులు బాగా లేవు. జోక్యం చేసుకోవాల్సి వస్తే, ఖచ్చితంగా కేంద్రం జోక్యం చేసుకుంటుంది. అదెలాగన్నది బీజేపీ, జనాగ్రహ సభలో చెప్పబోతోంది..’ అని సెలవిచ్చారు ఈ మాజీ కేంద్ర మంత్రి.

చంద్రబాబు హయాంలో సుజనా చౌదరి చక్రం తిప్పారు.. ఇటు పార్టీలోనూ, అటు ప్రభుత్వంలోనూ. అవకాశవాద రాజకీయాల్లో భాగంగా ఆ తర్వాత ప్లేటు ఫిరాయించేశారు. చంద్రబాబు ప్రధాన మంత్రి అయినా, వైఎస్ జగన్ ప్రధాన మంత్రి అయినా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదన్నది సుజనా తాజా ఉవాచ. ఎందుకు రాదు, మోడీ తలచుకుంటే మరుక్షణమే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి తీరుతుంది.