సీఎం వైఎస్ జగన్ క్యాబినెట్ లో ఒకరైన కన్నబాబుకు అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో మంచి ఆదరణ ఉంది. టీడీపీ సర్కారు హయాంలో జరిగిన అవినీతిపై విచారించేందుకు వేసిన పలు సబ్ కమిటీల్లోను ఆయన సభ్యునిగా ఉన్నారు. ఇటీవలే విశాఖ జిల్లా ఇన్‌చార్జి బాధ్యతలు కూడా అప్పగించారు. రాష్ట్ర సర్కారు ఆయనకు ఇంత ప్రాధాన్యం ఇస్తున్నా ఆయన నియోజకవర్గంలో మాత్రం అధికారులు ఆయన్ని లెక్కచేయడం లేదు. దీంతో ఆయనకి అధికారులకు మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. బిజీ షెడ్యల్ తో పాటు ఆరోగ్య సమస్యల కారణంగా నియోజకవర్గానికి ఎక్కువ సమయం కేటాయించడం లేదు మంత్రి కన్నబాబు. దీంతో అధికారులకు ఈయనకు మధ్య సమన్వయం పూర్తిగా దెబ్బతిన్నది. ఈ మధ్యే జరిగిన విద్యా కమిటీల ఎన్నికలతో పాటు జగనన్న విద్యా కానుక కార్యక్రమంలో ఈ లోపం వెలుగులోకి వచ్చింది.
జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని ఇంద్రపాలెం డెమో స్కూల్‌లో ఏర్పాటు చేసారు అధికారులు. ఈ ఎంపికలో మంత్రిని ఏమాత్రం సంప్రదించలేదు పైగా ప్రొటొకాల్ విషయంలో కూడా గొడవలొచ్చాయి. అధికారుల తీరుతో ఖంగుతిన్నమంత్రి కన్నబాబు ఈ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేశారు. స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా బాయ్ కాట్ చేశారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్, మిగతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి విద్యాశాఖ అధికారులు కార్యక్రమాన్ని మమా అనిపించారట. ఇదే కార్యక్రమానికి వచ్చిన రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా విషయం తెలుసుకొని ఈ కార్యక్రమాన్ని బై కాట్ చేశారట. దీంతో కాకినాడలో మంత్రి-అధికారుల మధ్య కోల్డ్ వార్ ప్రారంభమైందనే టాక్ జోరందుకుంది.
రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉండడంతో నియోజవర్గానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నానని… ఇంతదానికే తనని నిర్లక్ష్యం చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారట కన్నబాబు. ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరించారట.