Jagan Targets TDP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించి ‘ఏదేదో జరిగిపోతోందని ఓవరాక్షన్ చేస్తున్నారు’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘దిశ’ యాప్ ద్వారా మహిళలకు భద్రత కల్పించేందుకు పోలీసు వ్యవస్థ పని చేస్తోందనీ చెప్పుకొచ్చారు.
‘దిశ’ యాప్ అంత సమర్థవంతంగా పని చేస్తోంటే, రాష్ట్రంలో అఘాయిత్యాలెందుకు జరుగుతున్నాయి.? ఈ ప్రశ్నకు ముఖ్యమంత్రి చిత్ర విచిత్రమైన రీతిలో స్పందించారు. అఘాయిత్యాలకు పాల్పడుతున్నవారికి టీడీపీతో సంబంధాలు వున్నాయన్నది ముఖ్యమంత్రి వాదన.
టెన్త్ పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంలో కూడా టీడీపీ నేతలదే కీలక పాత్ర అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తేల్చేశారు. అధికారంలోకి వస్తూనే,ప్రతిపక్షంతో ఐదేళ్ళపాటు పోరాడాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలుసుకోకుండా వుంటారా.? టీడీపీ అనుకూల మీడియాతోనూ పోరాడాలని ఆయనకు తెలియదా.?
టీడీపీ మద్దతుదారులే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారనుకుందాం.. మరి, ఈ విషయంలో ‘కుట్ర కోణాన్ని’ ఎందుకు పోలీసు వ్యవస్థ బయట పెట్టలేకపోతోంది.? ప్రశ్నా పత్రాల లీక్ వ్యవహారంలో నారాయణ విద్యా సంస్థల పేరు ప్రస్తావించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. మరి, మాజీ మంత్రి నారాయణను ఎందుకు అరెస్టు చేయడంలేదు.?
ఆరోపణలు తేలిక. వాటిని నిరూపించడమే కష్టం. విపక్షంలో వున్నప్పుడు ఏమైనా మాట్లాడొచ్చు. ముఖ్యమంత్రి, ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయడం వల్ల ప్రయోజనముండదు. పైగా, ముఖ్యమంత్రి ఆరోపణలకే పరిమితమై, చర్యలు తీసుకోవడంలో విఫలమైతే.. ప్రజల ముందు పలచనైపోతుంది.