Cm Stalin: రాజకీయ పార్టీల లక్ష్యం ఎప్పుడూ అధికారం సాధించాలనే. ఇందులో తప్పేమీ లేదు. అయితే.. అధికారం పొందిన తర్వాత ఎలాంటి పాలన అందిస్తుంది.. ప్రజల ఆకాంక్షలు ఏమేరకు నెరవేరుస్తుంది.. ప్రతిపక్షాలపై ఎలా వ్యవహరిస్తుంది.. అనేది చాలా ముఖ్యమైన విషయం. అయితే.. నేటి రోజుల్లో మాకన్నీ తెలుసు అనుకోవడమే అధికార పార్టీ సిద్ధాంతం. విపత్కర సమయాల్లోనూ.. ప్రస్తుత కరోనా వేళలోనూ ఇదే తీరు. మొన్నటికి మొన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా కరోనా సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై కొన్ని సలహాలు ఇచ్చారు.
కానీ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వీటిని స్వీకరించిందా.. లేదా అన్నది వారికే తెలియాలి. కానీ.. కొత్తగా ఏర్పడిన తమిళనాడు ప్రభుత్వం ఇందుకు ముందడుగు వేయడం విశేషం. ఇది నిజం. ప్రస్తుత కరోనా కల్లోలాన్ని ఎదుర్కొనేందుకు స్టాలిన ప్రభుత్వం ప్రతిపక్షాలను కూడా కలుపుకుని వెళ్తున్నారు. అధికారం సాధించాం కదా.. మేమే అన్నీ చేస్తాం అని ఊరుకోలేదు. కరోనా కట్టడికి 13 మంది ఎమ్మెల్యేలతో ఓ సలహా కమిటీ వేశారు. ఈ కమిటీలో 12 మంది విపక్ష ఎమ్మెల్యేలే ఉండేలా చేశారు. ఇందులో గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశాఖ మంత్రిగా పని చేసిన విజయ్ కుమార్ ను కూడా భాగస్వామిని చేశారు.
అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ కమిటీని ఏర్పాటు చేశారు. వీరందరి సలహాలు, సూచనలతోనే ఇప్పుడు రాష్ట్రంలో కరోనా మీద పోరాటం చేయబోతున్నారు సీఎం స్టాలిన్. ఇది నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామమనే చెప్పాలి. సమకాలీన రాజకీయాల్లో ఇటువంటి విధానాన్ని ఎక్కడా కనిపించదు. ప్రభుత్వం చర్యలు, విపక్షాల ఆరోపణలు.. ఇవే కనిపిస్తాయి. అందుకు భిన్నంగా ప్రభుత్వంపై విమర్శలకు తావివ్వకుండా అన్ని పార్టీలను కమిటీలో కలిపి ముందుకెళ్లడం వల్ల ప్రభుత్వానికి కూడా పని సులువు అవుతుంది.
పనులు మానుకుని విమర్శలకు సమాధానం చెప్పేకంటే అందరూ కలిసి ముందుకెళ్తే ప్రభుత్వానికి ఓ భారం తప్పినట్టే. ఇటువంటి నిర్ణయాన్ని సరైన సమయంలో స్టాలిన్ తన రాజకీయ పరిణితితోనే తీసుకున్నారని చెప్పాలి. ఇదే తరహాలో అందరూ ఆలోచిస్తారని చెప్పలేం. కానీ.. కొన్ని రాష్ట్రాలు తీసుకునే నిర్ణయాలు ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటాయి. మరి.. ఈ విషయంలో తమిళనాడును ఎవరైనా ఆదర్శంగా తీసుకుంటారో లేదో చూడాలి.