తెలంగాణ రాజకీయాలను ఒంటి చేత్తో ఏలిన సీఎం కేసీఆర్ ఇప్పుడు ఢిల్లీకి మకాం మార్చనున్నారని నిత్యం వార్తలు వస్తునే ఉన్నాయి. ఆ వార్తలను గతంలో టీఆర్ఎస్ నాయకులు కొట్టేస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ వార్తలపై టీఆర్ఎస్ నాయకులు అవునన్న విధంగానే వ్యవహరిస్తున్నారు. అయితే ఢిల్లీకి వెళ్తున్నారు కానీ సీఎంగా కాదని, బీజేపీకి వ్యతిరేకంగా ఒక కూటమిని ఏర్పాటు చెయ్యడానికి ఢిల్లీకి వెళ్తున్నారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. గతంలోనే ఫెడరల్ ఫ్రంట్ కోసం ప్రయత్నించిన కేసీఆర్ ఇప్పుడు ఆ ఆలోచనను ఆచరణలో పెట్టడానికి సిద్ధమయ్యారు.
కేసీఆర్ అనారోగ్యం- కేటీఆర్ సీఎం
ఇటీవల కేసీఆర్ కొంత అస్వస్థతకు గురయ్యారు. వైద్యులు కూడా ఆయనను కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. రోజువారీ పాలనలో భాగంగా కేసీఆర్ వత్తిడిని ఎదుర్కొంటుండటంతో ఆయన మరింత అనారోగ్యానికి గురయ్యే అవకాశముందని కుటుంబ సభ్యులు కూడా భావిస్తున్నారు. అందుకే కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసి తాను పార్టీ వ్యవహారాలను చూసుకోవాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు చెబుతున్నారు.
ఎన్టీఆర్ ను ఫాలో అవుతున్నారా!!
గతంలో సీనియర్ ఎన్టీఆర్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నేషనల్ ఫ్రంట్ ను ఏర్పాటు చెయ్యడానికి ప్రయత్నించారు. దాని ఫలితమే 1984లో నేషనల్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ కూడా ఢిల్లీకి వెళ్లి, ఇతర పార్టీల ముఖ్య నేతలను కలుస్తూ, బీజేపీని గద్దె దించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆయన అనుకున్న వ్యూహాన్ని ఇతర పార్టీల నేతలకు వివరిస్తూనే, ఇక్కడ రాష్ట్రంలో సీఎంగా ఉండే కేటీఆర్ కు సలహాలు ఇస్తారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.