ఏపీ సీఎం జగన్ మరోసారి ప్రధాని మోదీకి లేఖ రాశారు.. సోమవారం పార్లమెంట్ లో విశాఖ ఎంపీ సత్యన్నారయణ అడిగిన ప్రశ్నకు సమాధానంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వడంతో సీఎం జగన్ మరోసారి లేఖ రాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దంటూ ప్రధానిని కోరారు. నష్టాల్లో కూరుకుపోయిన విశాఖ స్టీల్‌ను ఎలా పునరుద్ధరించ వచ్చో పలు సూచనలు చేశారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై తమ నిర్ణయాన్ని మరోసారి పునారాలోచించాలని ప్రధానిని సీఎం జగన్ కోరారు. తాజాగా కేంద్రం ప్రకటన తరువాత ఏపీ వ్యాప్తంగా ఉద్యమం ఎగసిపడుతోంది. విశాఖలో అయితే అర్థరాత్రి నుంచి ఆందోళనలు కొనసాగూతూనే ఉన్నాయి. రాజకీయ నాయకులను నిర్బంధిస్తామని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా కేంద్రానికి తోడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కార్మికసంఘాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన సీఎం జగన్ మరోసారి ప్రధాని మోదీకి లేఖ రాశారు. రాష్ట్ర ప్రజల సెంటిమెంట్.. ఆంద్రప్రదేశ్ ప్రయోజనాలను అన్నింటినీ ఆలోచించి స్టీల్ ప్లాంట్ పై నిర్ణయాన్ని మార్చుకోవాలని లేఖలో కోరారు.. తమ సమస్యను నేరుగా వచ్చి వినిపించే అవకాశం కల్పించాలని అన్నారు. అలాగే గతంలో రాసిన లేఖపైనా స్పందించలేదని.. దీనిపైనైనా వెంటనే స్పందించాలని జగన్ కోరారు.. గతంలోనే ఇదే విషయమై జనగ్ లేఖ రాసిన సంగతి తెలిసిందే.
విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలో పెట్టుబడుల ఉపసంహరణపై పునరాలోచన చేయాలని మోదీని లేఖ ద్వారా కోరారు. ప్లాంటును బలోపేతం చేయడానికి మార్గాల్ని అన్వేషించాలి.విశాఖ ఉక్కు ద్వారా సుమారు 20వేల మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు.పరోక్షంగా వేలాది మంది జీవనోపాధి పొందుతున్నారు. విశాఖ ఉక్కు – ఆంధ్రు హక్కు నినాద వేదికగా ప్రజల పోరాట ఫలితంగా స్టీల్‌ఫ్యాక్టరీ వచ్చిందని. దశాబ్దం కాలంపాటు ప్రజలు పోరాటం చేశారని.. నాటి ఉద్యమంలో 32 మంది ప్రాణాలు కోల్పోయారని జగన్ మరోసారి ప్రధానికి లేఖ ద్వారా గుర్తు చేశారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉండేందుకు అవకాశాలను పరిశీలించాలని మరోసారి కోరారు. స్టీల్‌ప్లాంటుకు సొంతంగా గనులు లేవు. పెట్టుబడుల ఉపసంహరణకు బదులు అండగా నిలబడ్డం ద్వారా ప్లాంటును మళ్లీ ప్రగతిబాటలోకి తీసుకెళ్లవచ్చని సూచించారు. అయితే మరోవైపు జగన్ లేఖపైనా విపక్షాలు విమర్శిస్తున్నాయి.. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలోనే జగన్ ఇలా లేఖలతో డ్రామాలు ఆడుతున్నారని.. స్టీల్ ప్లాంట్ వ్యవహారం అంతా జగన్ కు తెలిసే జరుగుతోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.