వైఎస్సార్సీపీ ‘రాజమండ్రి’ పంచాయితీ ఏమయ్యింది.?

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజమండ్రి లోక్ సభ సభ్యుడు.. అలాగే ఆ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మధ్య ఆధిపత్య పోరు కాస్తా మీడియాలో హాట్ టాపిక్ అయిన విషయం విదితమే. ఇద్దరూ యువ నాయకులే. ఒకరు అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి అద్భుత విజయాన్ని అందుకుంటే, ఇంకొకరు రాజకీయ వారసత్వంతో తన ఉనికిని చాటుకున్నారు. ఒకరు ఎంపీ భరత్, ఇంకొకరు ఎమ్మెల్యే రాజా. ఇద్దరి మధ్యా ఎక్కడ వివాదం మొదలైందోగానీ, ఒకరి మీద ఒకరు ఆధిపత్య పోరుకి తెరలేపారు. ఈ క్రమంలో దూషణలకు దిగారు. ‘నువ్వెంత.? నీ బతుకెంత.?’ అనే స్థాయికి విమర్శలు చేసుకున్నారు.

అందులో అవినీతి ఆరోపణలూ వున్నాయి. ఈ వ్యవహారంపై కాస్త లేటుగా వైసీపీ అధిష్టానం దృష్టిపెట్టింది. వైసీపీ ముఖ్య నేత వైవీ సుబ్బారెడ్డి రంగంలోకి దిగారు. ఇద్దరినీ పిలిపించి మాట్లాడారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. ఆ ఇద్దరికీ క్లాస్ తీసుకుని, అనంతరం ఇద్దర్నీ ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్ళారు వైవీ సుబ్బారెడ్డి. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత ఇటు భరత్ కావొచ్చు.. అటు రాజా కావొచ్చు.. ఇద్దరూ ఇంతవరకూ ఏమీ మాట్లాడలేదు. ఇదేదో సొంత పార్టీ వ్యవహారంలా మారిపోయిందా.? అంటే, పార్టీ వ్యవహారమే. కానీ, ఇద్దరూ ప్రజా ప్రతినిథులు. అవినీతి ఆరోపణలు కూడా చేసుకున్నారు. మరి, ఇద్దరిపైనా చర్యలు వుండవా.? అంటే, వుండే అవకాశమైతే లేదు. పార్టీకి నష్టం కలిగించినప్పటికీ, ఇద్దరిపైనా చర్యలు తీసుకునే సందర్భం కాదంటూ వైసీపీ అధిష్టానం హెచ్చరించి వదిలిపెట్టిందని అంటున్నారు. కానీ, ఇద్దరిలో ఒకరికి అయితే ‘ముప్ప’ రాజకీయంగా తప్పదన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా వైసీపీలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఒంటరి అయ్యారన్న ప్రచారం జరుగుతోంది.