జనంలోకి జగన్.. డిసెంబర్ ముహూర్తం.. అసలేంటి కథ.?

రెండున్నరేళ్ళ పాలన తర్వాత రాష్ట్రంలో ప్రజలు, తమ ప్రభుత్వం పట్ల సానుకూలంగా వున్నారా.? వ్యతిరేకంగా వున్నారా.? ప్రజల ఆలోచనలేంటి.? ప్రజలకున్న సమస్యలేంటి.? అనే అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా ప్రజల వద్దకు వెళ్ళి.. వారినుంచే ‘సరైన సమాచారాన్ని’ రాబట్టబోతున్నారట. డిసెంబర్‌లో తాను జిల్లాల పర్యటన ప్రారంభిస్తాననీ, సచివాలయాలను సందర్శిస్తాననీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తాజాగా ప్రకటించారు. స్పందన కార్యక్రమం సహా పలు అంశాలపై అధికారులతో సమీక్ష జరిపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, అధికారులు అలాగే మంత్రులు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల పరిష్కారం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.

సచివాలయాల్లోనే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనీ, దరఖాస్తు పెట్టుకున్న లబ్దిదారులు అర్హులైతే వెంటనే వారికి సంక్షేమ పథకాలు అందాలనీ, ఒకవేళ అనర్హులైతే ఆ వివరాల్ని లబ్దిదారులకు తెలియజేయాలనీ, సంక్షేమ పథకాల నుంచి ఏదన్నా కారణంతో లబ్దిదారుల్ని తొలగించాల్సి వస్తే, ఆ అనర్హత సమాచారం కూడా వారికి అందించాలనీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. నిజానికి, జనంలోకి వెళ్ళాలని వైఎస్ జగన్ గత కొంతకాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే, కరోనా నేపథ్యంలో ఆ ఆలోచనల్ని విరమించుకోవాల్సి వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్న దరిమిలా, డిసెంబర్ నాటికి.. కరోనా అన్న సమస్యే వుండదని వైఎస్ జగన్ భావిస్తున్నారట. మరోపక్క, అన్ని స్థానిక ఎన్నికల్లోనూ ప్రజలు స్పష్టమైన మెజార్టీ అధికార పార్టీకి ఇచ్చినప్పటికీ, ప్రజల్లో ఏ చిన్న అసంతృప్తీ ప్రభుత్వం పట్ల వుండకూదన్న భావన వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలో వుంది. అందుకే, స్వయంగా తాను రంగంలోకి దిగితే.. చిన్నపాటి వ్యతిరేకత.. అన్న సమస్య కూడా వుండదన్నది జగన్ ఆలోచన అట.