నేనున్నా చెల్లి.. కర్నూలు మేయర్ నువ్వే…బుట్టా రేణుకకు జగన్ బంపర్ ఆఫర్

రాజకీయాల్లోంచి కనుమరుగు అయిపోతున్న బుట్టా రేణుకను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మళ్లీ ఆదుకోబోతున్నారా ? పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరిన ఆమెకు మళ్లీ ఏదో ఒక పదవి కట్ట బెట్టబోతున్నారా ? కర్నూలులో చోటుచేసుకుంటున్నా తాజా రాజకీయ పరిణామాల మేరకు ఆమెకు మళ్లీ ఓసారి అవకాశం ఇవ్వాలని అధినేత భావిస్తున్నట్లు సమాచారం.

జగన్ ఆశీస్సులతో అనూహ్యంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బుట్టా రేణుక ఏకంగా ఎంపీ అయ్యారు. సరిగ్గా అప్పుడే రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలై టీడీపీ అధికారంలోకి వచ్చింది. పొలిటికల్ ఈక్వేషన్లను సరిగ్గా అర్థం చేసుకోలేక పోవడంతో పాటు … కుటుంబ ఆర్థిక సమస్యల నేపథ్యంలో టీడీపీలో చేరారు. అయితే కిందటి ఎన్నికల్లో ఆమెను కాదని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి చంద్రబాబు కర్నూలు లోకసభ టిక్కట్టు ఇవ్వడంతో గత్యంతరం లేక మళ్లీ వైసీపీలో భేషరతుగా చేరి పార్టీ విజయానికి తనవంతు సాయం చేశారు. కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ప్రభంజనంతో వైసీపీ అధికారంలో వచ్చింది. అయితే ఎంపీ బుట్టా రేణుక మాత్రం ఖాళీగా ఉండిపోయారు. ఆమధ్యలో ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నించినా అధినేత వారించడంతో మిన్నకుండిపోయారు. దీంతో కర్నూలు రాజకీయాల్లోంచి బుట్టా రేణుక కనుమరుగవుతోందనే ప్రచారం జోరందుకుంది.

అయితే కర్నూలు మేయర్ పీఠాన్ని బుట్టా రేణుకకు అప్పగించబోతున్నారని తాజా సమాచారం. బుట్టా రేణుక మాదిరిగానే వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. టీడీపీలోకి చేరిన ఎస్వీ మోహన్ రెడ్డి కూడా మేయర్ పీఠం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారంట. తన భార్యను ఎలాగైనా ఈసారి మేయర్ చేయాలని విశ్వప్రయత్నం చేస్తున్నారట. అయితే బుట్ట రేణుక బీసీ కావడంతో ఆమె వైపే అధినేత జగన్ మొగ్గు చూపుతున్నారని సమాచారం. ఈమేరకు హామీ కూడా ఇచ్చినట్లు సమాచారం. ఏదేమైనా రాజకీయంగా కష్టకాలం ఎదుర్కొంటున్న బుట్టా రేణుకకు కర్నూలు మేయర్ పీఠం దక్కడం నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అదృష్టమే. మళ్లీ పొలిటికల్ గా యాక్టివ్ అయ్యే అవకాశం లభించినట్లే.