ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వచ్చే ఏడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర భూ సర్వే చేపట్టాలని, అందుకోసం తగిన కార్యాచరణ సిద్ధం చేస్తుంది. అయితే సీఎం జగన్ మెప్పు కోసం ఏపీ అధికారులు చేస్తున్న నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది. వచ్చే జనవరి నుంచి ఏపీలో పెద్ద ఎత్తున నిర్వహించనున్న సమగ్ర భూసర్వే కోసం ముఖ్యమంత్రి జగన్ బొమ్మలతో కూడిన సర్వే రాళ్లను తయారుచేయించటం ఆసక్తికరంగా మారింది. సర్వే కోసం జగన్ నిర్వహించే రివ్యూలో భాగంగా.. సీఎంకు చూపించేందుకు అధికారులు రాళ్లపై జగన్ బొమ్మలు చెక్కించినట్లుగా చెబుతున్నారు.
ఒకవైపు బాణం గుర్తు..మరోవైపు సమగ్ర భూసర్వే 2021 అని రాయించి.. సీఎం జగన్ బొమ్మ ను గీయించారు. భూసర్వే సందర్భంగా ఆయా స్థలాల్లో ప్రభుత్వం సరిహద్దుల రాళ్లను ఏర్పాటు చేయటం జరుగుతుంది. గతంలో ఇలాంటి వాటికోసం తక్కువ ఖర్చులో వస్తాయని కొండ రాళ్లను ఉపయోగించేవాళ్ళు, కొండరాళ్ళ మీద బొమ్మ చెక్కిస్తే అది సరిగ్గా రాదు. దీనితో స్పెషల్ గా గ్రానెట్ రాళ్లను ఎంపిక చేసి వాటిపై జగన్ బొమ్మను చెక్కిస్తున్నారు.ఏపీలో మొత్తం 1.35 కోట్ల సర్వే నెంబర్లు ఉన్నాయని.. 49 లక్షల భూమి ఫోటోలు ఉన్నాయని.. 1.59 కోట్లసబ్ డివిజన్లు ఉన్నట్లు చెబుతున్నారు. ఒక్కో సర్వే నెంబరు వద్ద నాలుగు సరిహద్దు రాళ్లు వేసినా.. మొత్తంగా 5కోట్ల గ్రానైట్ రాళ్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు.
గ్రానెట్ రాళ్లు, వాటిపై సీఎం జగన్ బొమ్మ అబ్బో చాలా పెద్ద తతంగం ఉంటుంది. ఇప్పటివరకు అయితే సీఎం జగన్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది. స్కూల్ పిల్లలకు ఇచ్చే బ్యాగ్స్ , బెల్టు లాంటి వాటినే స్వయంగా నాణ్యతను పరిశీలించి అప్పుడు అనుమతి ఇచ్చే జగన్, ఈ రాళ్ల విషయం కూడా పరిశీలించే అవకాశం వుంది. అధికారుల తీరును తప్పుపట్టి రాళ్ల ప్రక్రియను మారుస్తాడో, లేక అనుమతి ఇస్తాడో చూడాలి.. ఇప్పటికే ప్రతి పధకం జగన్ పేరు మీద ఉండటం, పసిపిల్లలకు ఇచ్చిన బెల్టు, బ్యాగ్స్ పై జగనన్న పేర్లు ఉండటం పట్ల అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు రాళ్ల మీద జగన్ బొమ్మలు చెక్కించి సర్వే రాళ్లుగా ఉపయోగిస్తే ఆరోపణలు ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యమంత్రిగా సీఎం జగన్ కు పేరు పెట్టటానికి లేదు. కాకపోతే ఇలాంటి విషయాల్లో కొంచం ఆలోచిస్తే మంచిది.