ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం భావి తరాలకు ఆయన్ని గుర్తు ఉంచుకునే విధంగా ఉండబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర భూ సర్వే కార్యక్రమాన్ని జగన్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ప్రారంబిస్తున్నారు. వందేళ్ల చరిత్రలో దేశంలోనే అతి పెద్ద రీసర్వేను జగన్ సర్కార్ తలపెట్టడం సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది.
వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు– భూ రక్ష పథకం’ ద్వారా భూముల సమగ్ర రీసర్వే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం శ్రీకారం చుడుతోంది.ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు నుంచి లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని నేడు ప్రారంభించనున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద ఇప్పటికే రీసర్వే పూర్తి చేశారు. తక్కెళ్లపాడులో స్థిరాస్తి హక్కు పత్రాలు (క్యూఆర్ కోడ్‌తో కూడిన కార్డులు), భూమి హక్కు పత్రాలను యజమానులకు సీఎం జగన్ అందజేయనున్నారు.
అన్నదమ్ముళ్లు సైతం హత్యలకు పాల్పడేందుకు వెనుకాడని దుస్థితిని పరిష్కారానికి నోచుకోని భూసమస్యలే అని చెప్పక తప్పదు. పొలం గట్ల తగాదాలు, ఆస్తుల పంపకాలు, సాగు అనుభవంలో ఉన్న భూమికి, పట్టాదారు పాసు పుస్తకంలో నమోదైన భూమికి మధ్య వ్యత్యాసాలు ….ఇలా భూసమస్యలు ఎన్నెన్ని రకాలో. వీటిని పరిష్కరించాల్సిన రెవెన్యూశాఖ, డబ్బుకు, అధికారానికి లొంగిపోయి, పరపతి ఉన్నవాళ్లకే ఒత్తాసు పలుకుతున్న వైనం. దీంతో అధికారం, అంగబలం లేని సామాన్యులకు భూసమస్య పరిష్కారం అందని ద్రాక్షగా మిగిలిపోయింది.మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒక గ్రామంలో రీసర్వే పనులు ప్రారంభమవుతాయి.
అనంతరం వారం రోజుల్లో ప్రతి రెవెన్యూ డివిజన్‌లో ఒక గ్రామంలోనూ, ఆ తర్వాత నాలుగైదు రోజుల్లో ప్రతి మండలంలో ఒకటి చొప్పున 670 గ్రామాల్లో రీసర్వే ప్రారంభమవుతుంది. ఇలా విడతల వారీగా రీసర్వే ప్రారంభమై మొదటి విడతలో నిర్ణయించిన 5,122 గ్రామాల్లో ఈ ప్రక్రియ ఊపందుకుంటుంది.
రెండో దశలో 6000, మూడో దశలో మిగిలిన గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టి 2023 ఆగస్టు నాటికి రాష్ట్రమంతా రీసర్వే పూర్తి చేయనున్నారు. ఈ రీసర్వేతో దీర్ఘకాల భూ వివాదాలకు పరిష్కారం లభించనుంది. రాష్ట్రవ్యాప్తంగా అటవీ ప్రాంతం మినహా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఆస్తులు (ఇళ్లు, స్థలాలు) ప్రతి అంగుళం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొలుస్తారు. 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల (1.26 కోట్ల హెక్టార్ల ) పరిధిలో ప్రతి సెంటు భూమి/ స్థలం కొలిచి సరిహద్దులు నిర్ణయిస్తారు. మ్యాపులు తయారు చేస్తారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీని అమలు చేసేందుకు తన పుట్టిన రోజు నాడు శ్రీకారం చుట్టడం చరిత్రలో నిలిచిపోయే ఘటనగా చెప్పుకోవచ్చు.