రాజ్యసభ ఎన్నికలు అనంతరం మరోసారి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ – తెలుగు దేశం నేతల మధ్య మాటల యుద్దం జరుగుతోన్న సంగతి తెలిసిందే. టీడీపీ అభ్యర్ధిగా గెలిచిన వల్లభనేని అటుపై పార్టీ విధి విధానాలు…లోకేష్ ని అందంలం ఎక్కించడం నచ్చక పార్టీ నుంచి బయటకు వచ్చేసారు. ఆ తర్వాత టీడీపీ నేతలు వంశీపై మాటలు దాడి..ప్రతిగా వంశీ వాటిని తిప్పికొట్టడం మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గానే నలిగాయి. వంశీ హద్దు మీరి బూతుల దండకం అందుకోవడం..ఆ విషయంలో టీడీపీ నేతలు తగ్గి ఉండటం మరో ఆసక్తికర విషయం. ఈ నేపథ్యంలో వంశీ ఇప్పటీకీ పార్టీలో ఉన్నారా? లేరా? అన్నది తెలియదు.
అనధికారికంగా వైకాపాకు మద్దతిస్తున్నట్లు తెలిసింది. అయితే రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో వంశీకి టీడీపీ విప్ జారీ చేసింది. టీడీపీ అభ్యర్ధి వర్ల రామయ్యకు ఓటు వేయాల్సిందిగా చంద్రబాబు కోరినట్లు వంశీ తెలిపారు. దీంతో మరోసారి వంశీ పార్టీలో ఉన్నారా? లేరా అన్నది చర్చకొచ్చింది. ఈ నేపథ్యంలో శనివారం ఓ ఛానల్ సాక్షిగా టీడీపీ నేత అశోక్ బాబు-వంశీ మధ్య మాటల వాగ్వివాదం చోటు చేసుకుంది. అది జరిగిన కొన్ని గంటలకే తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ, కృష్ణా జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు సంచలన వ్యాఖ్యలు చేసారు. వంశీ టీడీపీకి రాజీనామా చేయలేదని, అతన్ని పార్టీనే సస్పెండ్ చేసిందని మచిలీపట్నం పార్టీ కార్యాలయంలో ధ్వజమెత్తారు.
టీడీపీలో వంశీ రెండుసార్లు శాసనసభ సభ్యుడిగా గెలిచాడని, ఇప్పుడు వైకాపాలోకి వెళ్లి టీడీపీని మునిగిపోయిన పడవ అనడం విడ్డూరంగా ఉందన్నారు. వంశీ ధైర్యవంతుడైతే రాజ్యసభ ఎన్నికల్లో వైకాపా అభ్యర్ధులకు ఎందుకు ఓటు వేయలేదని ప్రశ్నించారు. మరి ఈ కామెంట్లపై వంశీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. సహజంగానే టీడీపీ నేతలు ఎవరైనా విమర్శలు చేస్తే వంశీ ఒంటికాలుపై లేచిపడతారు. ఆ విషయంలో వంశీకి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడన్నా…ఆయన తనయుడు లోకేష్ అన్నా ఏమాత్రం ఆలోచించరు.