సినిమా సునామీ: తప్పు నిర్మాతలదా.? థియేటర్ల యాజమాన్యాలదా.?

నాని హీరోగా నటించిన ‘టక్ జగదీష్’ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. అదే రోజున, ‘లవ్ స్టోరీ’ సినిమాని థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ‘సీటీమార్’ సినిమా కూడా థియేటర్లలోనే విడుదల కాబోతోంది. ఇంకొన్ని సినిమాలూ థియేటర్లనే ఎంచుకుంటున్నాయి.. ‘మేస్ట్రో’ సినిమా మాత్రం ఓటీటీ వైపు మొగ్గు చూపింది. ఎందుకిలా.? అంటే, ఎవరి బాధలు వాళ్ళవి. ‘టక్ జగదీష్’ మాత్రమే కాదు, పైన పేర్కొన్న సినిమాలన్నీ ఇప్పటికే విడుదలైపోయి వుండాలి. కానీ, కరోనా వైరస్ వల్ల వచ్చిన పాండమిక్ పరిస్థితి ఆ సినిమాల్ని దెబ్బకొట్టేసింది. థియేటర్లలో సినిమా విడుదల చేయడానికే నాని మొగ్గు చూపాడు. కానీ, ఏం లాభం.? పరిస్థితులు అనుకూలించడంలేదు. విదేశాల్లో కరోనా విజృంభించేస్తోంది. తెలుగు నాట కూడా పరిస్థితులు మరీ అంత బాగా ఏమీ లేవు.

ఆంధ్రప్రదేశ్‌లో రోజుకి మూడు ఆటలు మాత్రమే నడవడానికి అనుమతి వుంది. పైగా, అక్కడ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగానే నమోదవుతున్నాయి. వీటికి తోడు, టిక్కెట్ రేట్ల సమస్య కూడా వుంది ఏపీకి సంబంధించి. ఇన్ని తలనొప్పుల నడుమ, నిర్మాత.. ఓటీటీ వైపు మొగ్గు చూపడాన్ని ఎలా తప్పుపట్టగలం.? కానీ, థియేటర్ల యాజమాన్యాలు ఏమైపోవాలి.? డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితేంటి.? థియేటర్ల మీద ఆధారపడ్డవారి భవిష్యత్తేంటి.? ఇలా చాలా ప్రశ్నలు. ఇది నిజంగానే చాలా పెద్ద సునామీ. దీన్నుంచి తప్పించుకోవడం అంత తేలిక కాదు. ఇక్కడ ఎవర్నీ తప్పు పట్టలేం. ఎవరి గోల వారిది. అందరికీ అసలు సిసలు శతృవు కరోనా వైరస్. ఇప్పుడు అందరూ ఒక్కతాటిపై నడవాలి, ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవాలి. అంతే తప్ప, ఒకరిపై ఇంకొకరు నిందలు వేసుకుంటూ వెళితే.. మొత్తంగా పరిశ్రమ నష్టపోతుంది.. అది కరోనా కంటే భయానకమైన పరిస్థితి.