‘సామన్యుడికి అందుబాటు ధరల్లో సినిమా టిక్కెట్లు.. దోపిడీకి అస్సలు తావు లేకుండా చర్యలు చేపడుతున్నాం.. పెద్ద హీరో సినిమాకి అయినా, చిన్న హీరో సినిమాకి అయినా టిక్కెట్ ధర ఒక్కటే.. బెనిఫిట్ షోలుండవ్.. అదనపు షోలు వుండవ్..’ అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుండబద్దలుగొట్టేసింది. ఈ మేరకు చట్ట సవరణ కూడా చేసింది.
అయితే, దేశవ్యాప్తంగా ఒకే జీఎస్టీ అమలు అవుతున్నప్పుడు, సినిమా టిక్కెట్ల విషయంలో భిన్నమైన పరిస్థితులు ఎందుకు.? పెద్ద సినిమాల విషయంలో టిక్కెట్ల ధరలు పెంచుకునే వెలుసుబాటు కల్పించాలి.. సినీ పరిశ్రమను ఆదుకోవాలి.. అంటూ సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.
చిరంజీవి ట్వీటుపై పేర్ని నాని స్పందించారు. టిక్కెట్ ధరల పెంపు విషయమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారని పేర్ని నాని చెప్పుకొచ్చారు. సినిమా టిక్కెట్ ధరలకు సంబంధించి పలు విజ్ఞప్తులు వచ్చాయనీ, ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కూడా కురిసిందని పేర్ని నాని అంటున్నారు.
సంబంధిత శాఖ ముఖ్యమంత్రి వద్ద వున్నా, ఆ వ్యవహారాల గురించి సినీ ప్రముఖులు తనతో చర్చిస్తున్న దరిమిలా, వారందరు చెబుతున్న విషయాల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని పేర్ని నాని చెప్పారు.
కాగా, నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న ‘అఖండ’ సినిమా డిసెంబర్ మొదటి వారంలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం బెనిఫిట్ షోలు, అదనపు షోలు, టిక్కెట్ ధరల పెంపు వంటివి ఆశిస్తున్నారు. ఆ తర్వాత ‘పుష్ప’ సినిమా విషయంలోనూ ఇదే పరిస్థితి వుండొచ్చు. ‘ఆర్ఆర్ఆర్’ సంగతి సరే సరి.
మరి, వైఎస్ జగన్ ప్రభుత్వం, సినిమా టిక్కెట్ ధరల పెంపు, అదనపు షోల విషయంలో ‘స్టాండ్’ మార్చుకుంటుందా.? ‘యూ టర్న్’ ఈ విషయంలో కూడా తప్పదా.? వేచి చూడాల్సిందే.