Cinema Ticket : సినిమా టిక్కెట్ ధర 2,200: ఎవరు చూస్తారు చెప్మా.?

Cinema Ticket : వివాదాల ఫిలిం మేకర్ రామ్ గోపాల్ వర్మ, తాజాగా ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యారు.. సినిమా పరిశ్రమకీ, రాష్ట్ర ప్రభుత్వానికీ మధ్య ఇటీవల జరుగుతున్న రచ్చపై చర్చలు జరిపారు. ‘నా అభిప్రాయాల్ని నేను మంత్రితో పంచుకున్నారు. మంత్రి కూడా నాకు కొన్ని విషయాలు తెలియజెప్పారు.. చర్చలు సజావుగా సాగాయి. నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమే..’ అని సెలవిచ్చారు రామ్ గోపాల్ వర్మ.

కానీ, వెళ్ళే ముందు.. వెళ్ళి వచ్చిన తర్వాత వర్మ తీరులో తేడా కనిపించలేదు. సెటైర్లు వేశారు వర్మ వర్మ, మంత్రి పేర్ని నానిని కలిసేముందు ట్విట్టర్ వేదికగా. కలిసి వచ్చాక కూడా వర్మగారి ట్విట్టర్ షరామమూలుగానే బాంబులు పేల్చింది.

ముంబైలో ఓ సినిమా థియేటర్ల ఛెయిన్ సినిమా టిక్కెట్ ధరని 2,200 రూపాయలకు పెంచి అమ్ముతోందని చెప్పుకొచ్చారు. అదే, ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టిక్కెట్ ధర 200 రూపాయలకు చేరుకోవడం కూడా కష్టంగా మారిందన్నది వర్మ ట్వీటు సారాంశం. ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు.?’ అని ప్రశ్న కూడా సంధించాడు వర్మ.

సినిమా టిక్కెట్ ధర 2,200 రూపాయలు అయితే, థియేటర్‌కి వెళ్ళి సినిమా చూసేదెవరు.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. కొన్నాళ్ళ క్రితం ‘యాత్ర’ సినిమా కోసం మూడు లక్షల రూపాయలు వెచ్చించి ఓ వైఎస్సార్ అభిమాని, సినిమా టిక్కెట్టుని కొనుగోలు చేసిన వైనం అప్పట్లో పెను సంచలనం.

అభిమానులంటే అలాగే వుంటారు. టిక్కెట్ రేట్లు పెంచి అభిమానుల్ని దోచుకోవడమేంటి.? అని ప్రశ్నిస్తున్న అధికార వైసీపీ, ‘యాత్ర’ సినిమా విషయంలో జరిగిందేంటో కూడా చెబితే బావుంటుంది. అలాగని, టిక్కెట్ల ధరల విషయంలో జరుగుతున్న దోపిడీని ఎవరూ సమర్థించరు. సినిమా అనేది వినోదం.. ఆ వినోదం ప్రేక్షకులకు అందుబాటు ధరలో లభించాలి. అదే సమయంలో, మెరుగైన సాంకేతికతను సినిమా అందుకోవాలంటే.. తప్పదు, టిక్కెట్ ధర కూడా రీజనబుల్‌గా పెరగాల్సిందే.