కోవిడ్ 19 సినిమా కష్టాలు.. తీరేదెప్పుడు.?

కరోనా వైరస్ వచ్చింది, పోయింది.. అన్నట్టు లేదు పరిస్థితి. కరోనా పాండమిక్‌కి ముందు, కరోనా పాండమిక్‌కి తర్వాత.. అనుకోవడానికి కూడా వీల్లేని పరిస్థితి. ఈ కరోనా పాండమిక్ ఎన్నాళ్ళు వుంటుందో ఎవరికీ తెలియదు. మొదటి వేవ్, రెండో వేవ్.. ఇంతలోనే మూడో వేవ్.. అసలేం జరుగుతోంది.? ఇంతకీ తెలుగు సినిమా పరిస్థితేంటి.? ఇతర భాషలతో పోల్చితే, తెలుగు సినిమాల పరిస్థితి కాస్త బెటర్. నిజంగానే, తెలుగు సినీ పరిశ్రమ పెద్ద సాహసమే చేసింది, చేస్తోంది. సినిమాలు రిలీజవుతున్నాయి.. రిజల్ట్ సంగతి పక్కన పెడితే, థియేటర్ల వద్ద సందడి నెలకొంది. జనం బయటకు వస్తున్నా, కరోనా కేసులు తెలుగు రాష్ట్రాల్లో అదుపులోనే వుండడం కాస్తంత ఊరట. అయితే, ఎప్పుడు మూడో వేవ్ భగ్గుమంటుందో తెలియని భయం అయితే అలాగే వుంది.

రాత్రికి రాత్రి మళ్ళీ లాక్ డౌన్.. అనేస్తే, తెలుగు సినిమా పరిస్థితేంటి.? ఇదే ఇప్పుడు పరిశ్రమలో వ్యక్తమవుతున్న ఆందోళన. పెద్ద సినిమాలేవీ రిలీజ్ విషయంలో తొందరపడ్డంలేదు. అన్నీ దాదాపు సంక్రాంతికే ప్లాన్ చేసుకున్నాయి. దసరా బరిలో ఏ పెద్ద సినిమాలు విడుదలవుతాయి.? అన్నదానిపై గందరగోళం కొనసాగుతోంది. దసరా నాటికి పరిస్థితులు అనుకూలిస్తే, పరిశ్రమ కోలుకోవడానికి అవకాశం వుంటుంది. కానీ, వచ్చే నెలలో మూడో వేవ్ పుంజుకుంటుందన్న ప్రచారం నేపథ్యంలో పరిశ్రమ ఆచి తూచి వ్యవహరించాల్సి వస్తోంది. సినిమా పరిశ్రమ అంటే అద్దాల మేడ.. చిన్నరాయి పడినా, నష్టం దారుణంగా వుంటుంది. థియేటర్ల యాజమాన్యల నుంచి ఒత్తిడి.. ఓటీటీ నుంచి వస్తున్న ఆఫర్లు.. వెరసి సినీ పరిశ్రమ నలిగిపోతోంది. కరోనా కష్టాలు తీరేదెప్పుడోగానీ.. తెలుగు సినీ పరిశ్రమను తెలుగు రాష్ట్రాలు తగు రీతిలో ఆదుకోకపోవడం కూడా అత్యంత బాధాకరమైన విషయమే.