Nara Lokesh: నటరత్న నందమూరి బాలకృష్ణ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఏపీ విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కూడా బాలకృష్ణను ప్రశంసలతో ముంచెత్తారు. బాలకృష్ణతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, లోకేష్ ఆయనను “ముద్దుల మావయ్య”గా అభివర్ణించారు.
బాలకృష్ణ ఒక భోళా మనిషి, మంచి మనసున్న వ్యక్తి అని నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఆయన ఒకేలా ఉంటారని, ప్రజలకు అండగా నిలబడటంలో ఎప్పుడూ ముందుంటారని ప్రశంసించారు. “బాలకృష్ణ గారు ఎప్పుడూ యంగ్‌స్టర్. వారి ఎనర్జీ మాకు లేదు, ఆ సీక్రెట్ ఏంటో ఇప్పటికీ మాకు తెలియలేదు” అని నవ్వుతూ చెప్పారు.
వివిధ రకాల జోనర్లలో, పాత్రల్లో నటించి మెప్పించడం బాలకృష్ణకే సాధ్యమని లోకేష్ అన్నారు. నిర్మాతలు, దర్శకులకు ఆయన ఒక డ్రీమ్ హీరో అని, నేటి ఓటీటీ యుగంలో కూడా ఆయన తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పిస్తున్నారని తెలిపారు. “బాలయ్య బాబు అన్‌స్టాపబుల్” అని పేర్కొంటూ, సినిమా పరిశ్రమలో ఆయనలాంటి వ్యక్తి మరొకరు లేరని నారా లోకేష్ కొనియాడారు. ఈ అరుదైన సందర్భంలో తన ముద్దుల మావయ్యకు శుభాకాంక్షలు తెలిపే అవకాశం లభించినందుకు లోకేష్ ధన్యవాదాలు తెలియజేశారు.


