Cine Agenda : తెలుగు సినీ పరిశ్రమ నుంచి ప్రతినిథుల బృందం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ కానున్న విషయం విదితమే. ఈ విషయమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని ప్రత్యేకంగా భేటీ అయ్యారు.. తాజా పరిస్థితులపై చర్చించారు.
టిక్కెట్ల ధరల విషయమై ఏం చేయాలి.? అన్న విషయమై ఈ భేటీ సందర్భంగా కీలక చర్చ జరిగిందంటున్నారు. అయితే, టిక్కెట్ల విషయమై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఇంకా నివేదిక ఇవ్వాల్సి వుందన్నది మంత్రి పేర్ని నాని చెబుతున్నమాట.
సినీ పరిశ్రమ నుంచి ప్రతినిథుల బృందం రాబోతోందనీ, ముఖ్యమంత్రితో ఆ బృందం సమావేశమవుతుందనీ, అయితే ఎజెండా మాత్రం ఇంకా ఖరారు కాలేదనీ చెప్పిన పేర్ని నాని, ఎవరెవరు సినీ పరిశ్రమ నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు వస్తున్నారన్నదానిపై మాత్రం స్పష్టతనివ్వలేదు.
చిరంజీవి, నాగార్జున, కొందరు నిర్మాతలు కలిసి ఓ బృందంగా సినీ పరిశ్రమ తరఫున, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అవుతారన్నది సినీ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం. అయితే, కోవిడ్ నేపథ్యంలో తక్కువమందికే ముఖ్యమంత్రిని కలిసే అవకాశం వుందని మంత్రి పేర్ని నాని అంటున్నారు.
ప్రస్తుతానికి సినీ పరిశ్రమ ఎదుర్కొంటోన్న కీలక సమస్య టిక్కెట్ల ధరల అంశం. దాంతోపాటుగా అదనపు షోలు వేసుకునే వెసులుబాటు.. కొత్త సినిమాలకి అదనపు టిక్కెట్ రేట్లు.. బెనిఫిట్ షోలు.. ఇలా పలు అంశాలున్నాయి. వీటిపట్ల జగన్ సర్కారు ఏమంత సానుకూలంగా లేదు. అయినా పరిశ్రమ తరఫున ప్రయత్నాలైతే జరుగుతున్నాయ్.