చైనాలో బర్డ్ ఫ్లూ ఆందోళన ప్రపంచాన్ని కలవర పెడుతోంది. బర్డ్ ఫ్లూ సోకేందుకు కారణమయ్యే వైరస్ ఇప్పటిదాకా కేవలం కోళ్లు, పక్షుల్లో మాత్రం వ్యాప్తి చెందుతుండగా.. తాజాగా ఆ వైరస్ ఓ మనిషికి సోకింది. ప్రపంచంలోనే బర్డ్ ఫ్లూ వైరస్ ఒక మనిషికి సోకడం ఇదే తొలిసారి. ఈ కేసు తాజాగా చైనాలో నమోదైంది. బర్డ్ ఫ్లూ వ్యాధికి H3N8 అనే స్ట్రెయిన్ కారణం. ఈ వైరసే తొలిసారిగా మనిషికి సోకింది.
ఈ మేరకు చైనా ఆరోగ్యశాఖ మంగళవారం ప్రకటించింది. అయితే, ఈ వైరస్ మనిషికి సోకినా, అది మానవుల్లో వ్యాప్తి చెందే రేటు చాలా తక్కువగా ఉంటుందని చెప్పారు. చైనా మధ్య ప్రాంతంలోని హెనాన్ ప్రావిన్స్‌లో ఓ నాలుగేళ్ల బాలుడికి ఈ బర్డ్ ఫ్లూ వైరస్ సోకింది. అతనికి జ్వరంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఉండడంతో పరీక్షలు చేయించగా, అది H3N8 వైరస్ అని తేలిందని చైనా ఆరోగ్యశాఖ ప్రకటించింది.
ఈ బాలుడితో ఇటీవల దగ్గరగా ఉన్న వ్యక్తులను కూడా గుర్తించి వారికి కూడా పరీక్షలు జరిపామని, వారికి వైరస్ సోకినట్లు ఎక్కడా పరీక్షల్లో తేలలేదని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ఓ ప్రకటన విడుదల చేసింది.
H3N8 వైరస్ సోకిన బాలుడి ఇంట్లో కోళ్లు, కాకుల్ని బాగా పెంచుతున్నారు. ఈ వైరస్ పక్షుల్లో కాకుండా గతంలో గుర్రాలు, కుక్కలు, రకరకాల పక్షుల్లో గుర్తించారు. కానీ, మనుషుల్లో గుర్తించడం మాత్రం ఇదే తొలిసారని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రకటించింది.