సీఆర్డీయే చట్ట సవరణతో వైసీపీకి ఒరిగేదేంటి.?

పేదలకూ రాజధానిలో చోటుండాలని వైసీపీ అనుకోవడాన్ని తప్పుపట్టలేం. చంద్రబాబు హయాంలో పేదలకు అమరావతిలో ఆస్కారం లేకుండా చేయాలని చూశారు.

అమరావతి మాస్టర్ ప్లాన్ చూస్తే ఎవరికైనా అదే అర్థమవుతుంది. రాజధాని అమరావతిని కార్పొరేట్ శక్తుల కోసమే అన్నట్లు ఆ మొత్తం ప్రాజెక్టుని చంద్రబాబు సర్కార్ డిజైన్ చేయించింది.

రైతుల నుంచి భూముల్ని ‘సమీకరణ’ పేరుతో లాక్కున్నమాట వాస్తవం. కొందరు రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తే, ఇంకొందరు ప్రభుత్వానికి భయపడి భూములిచ్చారు. సరే, అదంతా వేరే వ్యవహారం. రాష్ట్రానికి రాజధాని అయితే వుండి తీరాలి. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అయ్యింది గనుక, దాన్ని మార్చాలనుకోవడం సబబు కాదు.

మూడు రాజధానులు చేయాలనుకుంటే, అందులో ఒకటైన అమరావతిని ముందుగా అభివృద్ధి చేసి తీరాలి. కానీ, చంద్రబాబు మీద రాజకీయ కక్ష కారణంగా అమరావతి అభివృద్ధిని ఆపేస్తోంది వైసీపీ. ఇది బహిరంగ రహస్యం. వైసీపీ ఏం చెప్పినా, తెరవెనుకాల అసలు కథ ఇదే. అమరావతికి అటు చంద్రబాబు, ఇటు వైఎస్ జగన్.. ఇద్దరూ నష్టం చేశారన్నది నిర్వివాదాంశం.

తాజాగా సీఆర్డీయే చట్టంలో మార్పులు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం జరిగింది. గతంలో సీఆర్డీయే చట్టాన్ని రద్దు చేయాలని వైసీపీ సర్కారు భావిస్తే, న్యాయస్థానంలో మొట్టికాయలు ఎదురయ్యాయి. ఇప్పుడేమో చట్ట సవరణ అంటున్నారు.. ఓసారి మొట్టికాయలు పడిన దరిమిలా, ఈసారి ‘ధిక్కరణ’ కింద ప్రభుత్వం, కోర్టు ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి రావొచ్చన్నది న్యాయ నిపుణుల వాదన.

ఇంతా చేసి, వైసీపీ.. ఆ పేదల్లో పొందే సానుభూతి ఏమైనా వుంటుందా.? అంటే, అదీ వుండదాయె. ఎందుకంటే, ఏళ్ళు గడుస్తున్నా.. పేదలకు ఇస్తామన్న ఇళ్ళ స్థలాల్ని ప్రభుత్వం ఇవ్వడంలేదన్న వాదన వుంది. ఇచ్చిన కొన్ని స్థలాల వల్ల కూడా అస్సలు ఉపయోగం లేదనే విమర్శలూ లేకపోలేదు.

పంతం నెగ్గించుకోవాలన్న యావ తప్ప, రాజధాని విషయంలో ప్రభుత్వానికంటూ ఓ విధానం లేకపోవడాన్ని రాజకీయ పరిశీలకులు, సామాజిక వేత్తలు తప్పుపడుతున్నారు. అవసరమా ఇదంతా.?