ఎమ్మెల్యేగా కూడా చంద్రబాబు అన్‌ఫిట్: తేల్చేసిన వైఎస్ జగన్.!

పధ్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పని చేశానని చెప్పుకుంటారుగానీ, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఎమ్మెల్యేగా కూడా అన్‌ఫిట్.. అంటూ అసెంబ్లీ సాక్షిగా ఎద్దేవా చేశారు వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

అసలే కుప్పంలో చంద్రబాబుకి ఎదురుగాలి వీస్తోన్న పరిస్థితి కనిపిస్తోంది. కుప్పం నుంచీ విజయఢంకా మోగించాలని వైసీపీ కంకణం కట్టుకుంది కూడా.! 2023 ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుని ఓడిస్తామంటూ ఇప్పటికే వైఎస్ జగన్ స్పష్టం చేస్తున్నారు. పార్టీ శ్రేణుల్ని ఆ దిశగా ఉత్సాహపరుస్తున్నారు కూడా.

అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు మీద ‘అన్‌ఫిట్’ అనే ముద్ర వేయడం ద్వారా టీడీపీని ర్యాగింగ్ చేయడంలో కొత్త కోణం చూపించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు కేవలం పబ్లిసిటీ స్టంట్లు మాత్రమే చేశారనీ, చంద్రబాబు హయాంలో జరిగిన తప్పిదాల వల్లనే పోలవరం ప్రాజెక్టు ఆలస్యమవుతోందనీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు.

అయితే, ఇక్కడే వైఎస్ జగన్ తప్పులో కాలేశారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు. కేంద్రం పర్యవేక్షణలో రాష్ట్రం నిర్మిస్తున్న ప్రాజెక్టు అది. చంద్రబాబు హయాంలో అవినీతి జరిగినా, ఆలస్యం జరిగినా.. అందులో మెజార్టీ వాటా కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీది కూడా. చంద్రబాబుని విమర్శించినట్లే వైఎస్ జగన్, అసెంబ్లీ సాక్షిగా ప్రధానిని కూడా విమర్శించగలిగి వుంటే.. వైఎస్ జగన్ విమర్శలకు ఒకింత విశ్వసనీయత వుండేది.!

ఒక్కటి మాత్రం నిజం.. వైఎస్ జగన్ తన హయాంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేకపోతే, ‘అన్‌ఫిట్’ అనే అపప్రధని ఆయనా మోయాల్సి వస్తుంది.