రాజకీయాల్లో నాయకుల మాటలు ఎప్పటికప్పుడు పాతబడిపోతుంటాయి. నిన్న మాట్లాడిన మాటకు ఇవాళ గ్యారెంటీ ఉండదు. ఇవ్వాళ్ళ తప్పు అన్నవారే రేపు ఒప్పు అంటారు. నిన్న పలనా విధంగా చేయము అన్నవారే ఈరోజు చేసేస్తుంటారు. దీన్నే ఈమధ్య యూటర్న్ రాజకీయం అంటున్నారు మనవాళ్ళు. ఎవరైనా గతంలో ఒక మాట చెప్పి ప్రస్తుతంలో దానికి వ్యతిరేకంగా పోతుంటే యూటర్న్ కింగ్ అని పెరిచ్చేస్తున్నారు జనం. మన నాయకులు అందరూ ఈ టర్న్ విధానానికి అలవాటుపడ్డవారే. కానీ ఆ యు టర్న్ తీసుకునేటప్పుడు గతంలో తాము మాట్లాడింది, చేసింది తప్పని, పొరపాటని మాత్రం ఒప్పుకోరు.
ప్రస్తుతం తెలుగుదేశం కష్టాల్లో ఉంది. చంద్రబాబు నాయుడులో కూడ పస తగ్గింది. గతంలో ఉన్నంత పదునుగా ఉండట్లేదు ఆయన ఆలోచనలు. ఇదే గత ఎన్నికల్లో పార్టీ పతనానికి కారణమైంది. సరైన ఎన్నికల ప్లానింగ్ లేకనే చాలా చోట్ల కొద్దిపాటి ఓట్ల తేడాతో గెలుపుకు దూరమయ్యారు. వైఎస్ జగన్ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ బృందాన్ని నియమించుకుని ముందుకు దూసుకుపోతే బాబుగారు పాత మూస పద్దతిలోనే వెళ్లి చతికిలబడ్డారు. జగన్ పీకే బృందంతో పనిచేసేటప్పుడు బాబుగారు ఎన్నెన్నో అన్నారు. జగన్ కు రాజకీయం చేతగాక బయట నుండి వ్యక్తిని తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. ఇక టీడీపీ నేతలైతే అక్కడ కూడ బాబుగారికి ఎలివేషన్ ఇవ్వడం మానలేదు.
మా చంద్రబాబు అపర చాణుక్యుడు. ఆయన ఒక్కరే వందమంది పీకేలకు సమానం అంటూ గొప్పలు పలికారు. కానీ ఇప్పుడు అదే పద్దతిని అనుసరిస్తున్నారు. గత ఎన్నికల్లో పీకే బృందం చేసిన డ్యామేజ్ చూసేసరికి బాబుగారికి కళ్ళు తిరిగిన్నట్టయింది. అందుకే వచ్చే ఎన్నికలకు అదే స్ట్రాటజీని ఫాలో అవ్వాలని చూస్తున్నారు. ఆయన కూడ ఒక ఎన్నికల వ్యూహకర్తను నియమించుకున్నారు. ఆయనే రాబిన్ శర్మ. ప్రముఖ రచయిత అయిన ఆయన ఒకప్పుడు పీకే బృందంలో ఉన్నవారే. జగన్ కోసం పనిచేశారు కూడ. ఆయన్నే తెచ్చి పక్కనపెట్టుకున్నారు బాబు. తిరుపతి ఉప ఎన్నికల గెలుపు బాధ్యతలు ఆయనకే ఇచ్చారు. ప్రజెంట్ తిరుపతి విషయంలో అంతా రాబిన్ శర్మ చెప్పినట్టే నడుస్తోంది. వచ్చే ఎన్నికలకు కూడ ఆయనే వ్యూహకర్తగా ఉండనున్నారు. దీంతో వైసీపీ నేతలు అప్పుడేమన్నారు ఇప్పుడేం చేస్తున్నారు. దీన్నే యూటర్న్ అంటారు బాబుగారు అంటూ చురకలు వేస్తున్నారు.