ఏంటో.. ఈ ఏపీ రాజకీయాలు ఒక పట్టాన అర్థం కావు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేనట్టుగా.. విచిత్రంగా ఉంటాయి ఏపీ రాజకీయాలు. ఇక్కడి రాజకీయ నాయకులు వేసే ఎత్తులు, పైఎత్తులు వేరే వాళ్లకు చేతగాదు అంటే అతిశయోక్తి కాదు. అందుకే.. దేశ రాజకీయాల్లో ఏపీ రాజకీయాలకు ప్రత్యేక స్థానం.
2019లో ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్షంలోకి పడిపోయిన చంద్రబాబు.. మదిలో మెదులుతున్నది ఒక్కటే. 2024 ఎన్నికల్లో ఎలాగైనా టీడీపీని అధికారంలోకి తీసుకురావడం. దాని కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడుతున్నారు అని చెప్పడానికి ఇదొక్కటే ఉదాహరణ.
చంద్రబాబు ఎలాగూ ప్రతిపక్షనేత, అందులోనూ వైసీపీకి బద్ధశత్రువు.. ఎలాగూ వైసీపీని, సీఎం జగన్ పై విమర్శలు గుప్పిస్తుంటారు. కానీ.. ఉత్తి విమర్శల వల్ల లాభం లేదనుకొని.. ఒక సరికొత్త ఎజెండాతో చంద్రబాబు ముందుకెళ్తున్నారు.
సీఎం జగన్ ను ఇబ్బంది పెట్టాలన్నా.. ఏపీ ప్రజల్లో జగన్ కు వ్యతిరేకత తీసుకురావాలన్నా… తను జనాలను ఆకర్షించాలన్నా.. ఏదో ఒకటి గట్టిగా చేయాలనుకున్నారు. అందుకే.. మతం పేరుతో కొత్త ఎజెండాకు శ్రీకారం చుట్టారు చంద్రబాబు.
నేను హిందూ ధర్మ వాదిని.. హిందూ ధర్మాన్ని మనసా వాచా కర్మనా పాటిస్తాను.. కానీ సీఎం జగన్ హిందూ ధర్మ వ్యతిరేకి.. నాకు హిందూ ధర్మంపై పూర్తి విశ్వాసాలు ఉన్నాయి.. అని చెప్పుకోవడం కోసమే చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నట్టు తాజా ఘటనలను చూస్తే అర్థం అవుతోంది.
ఎందుకంటే.. తిరుమల డిక్లరేషన్ వివాదం, రాష్ట్రంలోని దేవాలయాలపై జరుగుతున్న దాడులపై వెంటనే స్పందించిన చంద్రబాబు.. హిందూ మతం రంగు పూసుకొని చేసిన విమర్శలే దానికి నిదర్శనమంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఖచ్చితంగా హిందూ మతాన్ని అడ్డంపెట్టుకొని జగన్ ను ఇబ్బందుల్లోకి నెట్టడం కోసమే చంద్రబాబు సరికొత్త గేమ్ ఆడుతున్నారని వార్తలు వస్తున్నాయి. అందుకే.. ఎప్పుడూ తెర మీదికి రాని తిరుమల డిక్లరేషన్ వివాదం ఇప్పుడు వచ్చిందని.. ఇదంతా చంద్రబాబు సరికొత్త ఎజెండా అని తెలుస్తోంది.