AP: సాధారణంగా ఒక హీరో సినిమా వేడుక జరుగుతూ ఉంటే మరొక హీరో అభిమానులు అక్కడ చేసే హంగామా మామూలుగా ఉండదు. ఒక హీరో సినిమా వేడుకలు మరొక హీరో అభిమానులు పెద్ద ఎత్తున తమ అభిమాన హీరో గురించి నినాదాలు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం రాజకీయ సభలలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంటుంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన ఓ బహిరంగ సభలో కొంతమంది జై జగన్ అంటూ నినాదాలు చేయడం సంచలనంగా మారింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాపట్ల జిల్లాలో పర్యటించారు. చిన్నగంజాం మండలం కొత్తగొల్లపాలెంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన ప్రజా వేదిక సభలో చంద్రబాబు ప్రసంగిస్తుండగా ఓ యువకుడు ఉన్నఫలంగా జై జగన్.. జై జై జగన్ అంటూ నినాదాలు చేశారు. అయితే ఈ మాటలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెవిన పడటంతో ఒక్కసారిగా షాక్ అవ్వుతూ ఆ యువకుడి వైపు చూశారు.
ఇలా చంద్రబాబు నాయుడు సభలో జగన్ పేరు వినిపించడంతో అక్కడున్న వారందరూ షాక్ అయ్యారు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం చాలా చాకచక్యంగా ఈ అంశం గురించి మాట్లాడుతూ..ఓ వైపు నవ్వుతూనే ఆ యువకుడికి చురకలు అంటించారు. ఇప్పుడు ఒక కుర్రాడొచ్చాడు. అతను ఏ గ్రామం నుంచి వచ్చాడో తెలియదు. అతనికి కడుపు నొప్పి ఉంటే.. డాక్టర్ దగ్గరకు వెళ్లాలి. వేరే ఏదైనా బాధ ఉంటే నా దగ్గరకు రావాలి. కానీ, ఇలా కేకలు వేస్తే, అతని కడుపు నొప్పి పెరుగుతుంది అంటూ చంద్రబాబు నాయుడు మాట్లాడారు.
మొదట్లో ఆ యువకుడి తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత మాత్రం చాలా సమయస్ఫూర్తితో చంద్రబాబు సమాధానం ఇచ్చారు.తన రాజకీయ జీవితంలో ఇటువంటి సందర్భాలు ఎన్నో చూశానన్నారు. 43 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, ఎవరైనా నిలదీయాలనుకుంటే గౌరవంగా వచ్చి తనకు చెప్పాలని.. అలా అయితే సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని చంద్రబాబు తెలిపారు.