ఓటమి షాక్ నుండి తేరుకుంటున్న క్రమంలో తెలుగుదేశం పార్టీకి నేతలు వరుస షాక్స్ ఇస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీలోకి వెళ్లిపోయారు. ఇక గెలిచిన ముగ్గురు ఎంపీలు తలోదిక్కు అన్నట్టు ఉన్నారు. కేశినేని నాని, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు గత ఎన్నికలలో వైసీపీ హోరుకు ఎదురొడ్డి గెలిచారు. వీళ్ళు గెలవడం మూలానే కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో పార్టీ ప్రణాలతో ఉంది. లేకుంటే కంచుకోటల్లాటి ఈ మూడు జిల్లాలో పార్టీ మూతబడేదే. అలాంటి ఈ ముగ్గురు ముఖ్యమైన నేతలను చంద్రబాబు ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ ఆయన అలా చేయడం లేదు. ముగ్గురినీ పక్కనపెట్టేసి పొరపాటు చేస్తున్నారు.
ఎన్నికలు అయిన వెంటనే చంద్రబాబు మీద అసమ్మతి గళం వినిపించారు కేశినేని నాని. ఇక రామ్మోహన్ నాయుడు అయితే చిన్నాన్న అచ్చెన్నాయుడు విషయంలో చంద్రబాబు వైఖరి పట్ల అసంతృప్తిగా ఉన్నారు. మరొక ఎంపీ గల్లా జయదేవ్ అయితే అసలు పార్టీనే వీడే ఆలోచనలో ఉన్నారట. గల్లా కుటుంబానికి రాజకీయాల కంటే వ్యాపారాల పరంగా పెద్ద సర్కిల్ ఉంది. వేల కోట్ల సామ్రాజ్యం అది. ఇప్పుడు దానికే ముప్పు వాటిల్లే పరిస్థితి. గత ప్రభుత్వం గల్లా వ్యాపారాలకు ఇచ్చిన భూములను ఇప్పటి ప్రభుత్వం వెనక్కు తీసుకునే ప్రయత్నం చేసింది. ఎలాగో కోర్టుకు వెళ్లి దాన్ని ఆపుకున్నారు జయదేవ్. కానీ ముందు ముందు ఇబ్బందులు పడాల్సిందే. అయినా ఓర్చుకుని పార్టీలో కొనసాగాలి జయదేవ్ భావించినా బాబుగారి వ్యవహారం ఆయనకు అసహనాన్ని తెప్పిస్తోందట.
పార్టీ రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించిన ప్రతి నిర్ణయాన్ని ఆయన సీనియర్ నాయకులతోనే చర్చించి తీసుకుంటున్నారు. అంతేకాదు గుంటూరు జిల్లా రాజకీయాల్లో కూడ ఓడిపోయినా నాయకులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారట. బాబుగారి అండ చూసుకుని మిగతా నాయకులు ఎంపీని లెక్కచేయట్లేదట. ఆయన నోటీసుకు వెళ్లకుండానే పనులన్నీ కానిచ్చేస్తున్నారు. ఎందుకిలా అంటే బాబు చెప్పారు చేస్తున్నాం అంటున్నారట. దీంతో చిర్రెత్తుకొచ్చింది జయదేవ్ పార్టీ పగ్గాలను పక్కన పడేసి సొంత వ్యాపారాల మీదనే ఎక్కువ దృష్టి పెడుతున్నారట. అంతేకాదు మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి సైతం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేసేశారు. దీంతో టీడీపీకి గల్లా కుటుంబానికి దూరం మరింత పెరిగిపోయింది. ఈ పరిణామాలతోనే జయదేవ్ పార్టీకి బైబై చెప్పేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.