ప్రతిపక్ష నేతగా చంద్రబాబు సంచలన నిర్ణయం.!

ప్రతిపక్ష నేతగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై.. అంటే, రానున్న రెండున్నరేళ్ళు ఆయన అసెంబ్లీకి ప్రతిపక్ష నేత హోదాలో హాజరు కారు. ఒక్కమాటలో చెప్పాలంటే, అసెంబ్లీ సమావేశాల్ని ఇకపై ఆయన బాయ్‌కాట్ చేయబోతున్నారన్నమాట.

మళ్ళీ ముఖ్యమంత్రిగానే శాసన సభలో అడుగు పెడతాననీ, అప్పటివరకూ అసెంబ్లీకి వచ్చేది లేదని చంద్రబాబు శపథం చేసేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల సందర్భంగా అధికార వైసీపీ, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మధ్య రాజకీయ రచ్చ చెలరేగింది. మాటల యుద్ధం జోరుగా సాగింది.

సభలో అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు వైసీపీ ప్రజా ప్రతినిథులు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పేరుని లాగి, అభ్యంతకరమైన వ్యాఖ్యలు వైసీపీ ప్రజా ప్రతినిథులు చేశారంటూ టీడీపీ ఆరోపిస్తోంది. తన భార్య పేరుని వివాదాల్లోకి లాగి, అభ్యంతరకరంగా అధికార పార్టీ నేతలు మాట్లాడారంటూ చంద్రబాబు కంటతడిపెట్టారు.

ఇది ‘గౌరవ సభ కాదు.. కౌరవ సభ..’ అంటూ వ్యాఖ్యానించిన చంద్రబాబు, అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేశారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఇలాంటి పరిస్థితుల్ని ఎప్పుడూ చూడలేదంటూ చంద్రబాబు వాపోతున్నారు. నిజమే, చట్ట సభల స్థాయి క్రమక్రమంగా దిగజారిపోతోంది. కానీ, దానికి కారణం ఎవరు.?

చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో వైఎస్ జగన్ కుటుంబ సభ్యుల మీద అప్పటి టీడీపీ శాసనసభ్యులు ఎలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేశారు.? అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యే రోజా మీద టీడీపీ శాసనసభ్యులు వాడిన పదజాలమేంటి.? చెప్పుకుంటూ పోతే, ఇదో జుగుప్సాకరమైన చరిత్ర.

ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టైమ్ నడుస్తోంది.. చంద్రబాబు అనుభవిస్తున్నారు. ఈ చట్ట సభలింతే.. వీటి వ్యవహారమింతే.