ఒక సామాజిక వర్గంలో బలం ఉంది ఇంకో సామాజిక వర్గంలో లేదు అనకుండా గత ఎన్నికల్లో వైఎస్ జగన్ అన్ని వర్గాల మద్దతు కూడగట్టుకున్నారు. కాపు, కమ్మ, రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఇలా అన్ని వర్గాల వారు వైసీపీ కి జైకొట్టారు. ఫలితం జగన్ తాను కూడా ఊహించని స్థాయిలో 153 అసెంబ్లీ, 22 పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకోగలిగారు. ఈ విజయంతో చంద్రబాబు నాయుడు పునాదులు కదిలిపోయాయి. ఒక్కసారి పాతాళానికి పడిపోయారు. సుధీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడూ చూడనంత రాజకీయ సంక్షోభాన్ని చూడాల్సి వచ్చింది. ఎన్నికల తర్వాత ఎప్పటికప్పుడు జగన్ మీద పైచేయి సాధించాలని ఎత్తులు వేస్తూ వచ్చిన బాబు జగన్ బలం గుర్తొచ్చినప్పుడల్లా నీరుగారిపోయేవారు.
గత ఎన్నికల్లో బాబు సారథ్యంలోని టీడీపీని బీసీ వర్గాలు ఊహించని రీతిలో తిరస్కరించాయి. టీడీపీకి ప్రధాన బలమే బీసీ వర్గాలు. అవే జగన్ వైపు చూశాయి. పూర్తిగా కాకపోయినా ఎన్నడూ టీడీపీకి తప్ప ఇతర పార్టీలకు ఓటు వేయని బీసీలు కొంతమేర వైసీపీకి ఆకర్షితయ్యారు. ఈ కొద్ది తేడాకే టీడీపీ కుప్పకూలినంత పనైంది. కాబట్టి మొత్తం బీసీ వర్గాన్ని తన వైపుకు తిప్పుకుంటే బాబుగారికి భవిష్యత్తు అనేదే లేకుండా చేయవచ్చనేది జగన్ ఆలోచన. అందుకే సంక్షేమ పథకాల ద్వారా వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సఫలమవుతున్నారు కూడ. ఈ పరిణామాన్ని జాగ్రత్తగా గమనించిన చంద్రబాబు జగన్ ను సామాజిక వర్గం పరంగానే బలహీనపరచాలని పథక రచన చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఆ పథకం పేరే కిరణ్ కుమార్ రెడ్డి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవడం కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అవడం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడటంతో కిరణ్ కుమార్ రెడ్డి సొంత పార్టీ పెట్టడం, తర్వాత దాన్ని మూసివేయడం జరిగాయి. మళ్లీ ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యే పనిలో ఉన్నారట. అందుకు కారణం చంద్రబాబేనని టాక్. కిరణ్ కుమార్ రెడ్డిని తిరిగి రాజకీయ క్షేత్రంలో నిలబెడితే గెలవకపోయినా వైసీపీకి అండగా ఉన్న రెడ్డి, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీలను కొంతమేరైనా చీల్చగలుగుతారని చంద్రబాబు నాయుడు ఆలోచట. వినడానికి బాగానే ఉన్న ఈ ఎత్తుగడ వెయ్యి ఏనుగులంత బలంగా ఉన్న జగన్ ను దెబ్బతీయగలదా లేదా అనేదే అనుమానం. మరి కాలక్రమంలో ఈ ప్లాన్ ఫలించి కదిలిన చంద్రబాబు నాయుడు పునాదులు కూలకుండా ఉంటాయేమో చూడాలి.