చంద్రబాబు నాయుడు ఎంత ప్రయత్నించినా వైఎస్ జగన్, వైసీపీలను దెబ్బకొట్టడం ఆయన వలన కావట్లేదు. ఎన్ని ఎత్తులు వేసినా అన్నీ విఫలమవుతున్నాయే తప్ప ఒక్కటీ ఫలించట్లేదు. దీంతో బాబుగారు సమీక్ష చేసుకోవడం మొదలుపెట్టారు. గతంలో ప్రతిపక్షంలో ఉండగా ఎన్నడూ ఇలా విఫలమైంది లేదు. మరిప్పుడు ఎందుకిలా అడుగడుగునా వైఫల్యాన్ని చూడవలసి వస్తోంది అంటూ పార్టీ నేతలతో చర్చలు జరిపారట. ఈ చర్చల్లో ఆయనకు ఒక సత్యం బోధపడిందని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు.
ఇన్నాళ్లు చంద్రబాబు వైఎస్ జగన్ మీద దృష్టి పెట్టి ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేయాలని, ఆయన్ను ఇతరుకున పెట్టాలని కిందామీదా పడ్డారు. కానీ ఆయన సాధించింది ఏమీ లేదు. జగన్ ఛరీష్మా ముందు, సంక్షేమ పథకాలు తెస్తున్న పేరు ముందు ఆయన పనులు, మాటలు చిన్నబోయాయి. కనుక ఈసారి జగన్ నుండి కాకుండా పార్టీ వైపు నుండి నరుక్కురావాలని డిసైడ్ అయ్యారట. అంటే జిల్లాలవారీగా వైసీపీని దెబ్బకొట్టాలనేది ప్లానట.
ఏయే జిల్లాల్లో వైసీపీ బలహీనంగా ఉందో గుర్తించి ఆ జిల్లాల్లో టీడీపీని యాక్టివ్ చేయాలని, వైసీపీకి సహకరించే శక్తులను తమవైపుకు తిప్పుకోవాలనేది టీడీపీ పథకమట. కొన్ని జిల్లాల్లో ఎలాగూ వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు నడుమ సయోధ్య లేదు. ఈ పరిణామాన్ని కూడ వాడుకోవాలని చూస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. ఇందుకోసం నేరుగా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే రంగంలోకి దిగుతారట. అవసరమైతే చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని స్థాయిల నేతలతో తానే స్వయంగా మాట్లాడటానికి కూడా బాబుగారు రెడీగా ఉన్నారట. చూడబోయే చంద్రబాబు ఏదో పెద్ద పథకంతోనే రంగంలోకి దిగుతున్నట్టు అనిపిస్తోంది.