పూటకొకసారి తన ఎమ్మెల్యేలను లెక్కపెట్టుకోవాల్సిన పరిస్థితిలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఉన్నారు. అందుకు కారణం వైఎస్ జగన్ అనుసరిస్తున్న ఆపరేషన్ ఆకర్ష్. ఈ విధానంతో ఉదయం ఉన్న ఎమ్మెల్యే సాయంత్రానికి బైబై చెప్పేసి వెళ్లిపోతున్నారు. గెలిచిన 23మందిలో ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు పార్టీకి అనధికారికంగా రాజీనామా చేశారు. వారంతా ఇప్పుడు వైసీపీతో చేతులు కలిపేశారు. త్వరలో మరొక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా సైకిల్ దిగి వెళ్ళిపోతారని బలమైన వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో జగన్ మీద తాను ప్రయోగించిన ఈ ఫిరాయింపుల అస్త్రం ఇప్పుడు తన మీదకే రివర్స్ అవడంతో బాబుగారు గిలగిల్లాడిపోతున్నారు.
ప్రస్తుతం వైసీపీ రాజకీయ వ్యూహం ఎక్కువగా విశాఖ మీరు ఉంది. త్వరలో వైజాగ్ పాలనాపరమైన రాజధాని కానుంది. దీంతో విశాఖ నగరాన్ని పూర్తిగా గుప్పిట్లోకి పెట్టుకోవాలని వైసీపీ వ్యూహం. అందుకే నగరంలోని నాలుగు ప్రధాన నియోజకవర్గాలు సౌత్, నార్త్, వెస్ట్, ఈస్ట్ మీద దృష్టి పెట్టింది. ఇప్పటికే సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ను టీడీపీ నుండి లాగేసుకున్నారు. నార్త్ ఎమ్మెల్యే గంటా రాక ఎలాగూ ఖాయమైపోయింది. ఇక వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు సైతం రేపో మాపో టీడీపీ మీద వ్యతిరేక గొంతుక వినిపించవచ్చ్చనే వాతావరణం ఉంది. దీంతో ప్రధాన రాజధాని నగరంలో పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడ ఉండరేమోననే దిగులు పట్టుకుంది.
కానీ ఈ కష్టకాలంలో పార్టీ కోసం నేనున్నాను అంటున్నారు ఈస్ట్ వైజాగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ. ఈయన్ను కూడా టీడీపీకి దూరం చేయాలని చాలా ప్రయత్నాలు, మంతనాలు జరిగాయి, జరుగుతున్నాయి, కానీ ఆయన మాత్రం ఏమాత్రం లొంగడంలేదు. టీడీపీని, చంద్రబాబును వీడి వచ్చే ప్రసక్తే లేదని చెబుతున్నారట. వెలగపూడికి ఈస్ట్ నియోజకవర్గంలో చాలామంచి పేరుంది. ఆయన ప్రభావం చుట్టుపక్కల నియోజకవర్గాల మీద ఉంటుంది, ఆయన పార్టీలోనే ఉంటే వైజాగ్ సిటీలో టీడీపీ బ్రతికిబట్టకట్టగలుగుతుంది. అందుకే చంద్రబాబు వెలగపూడి నిజాయితీని చూసి సంతోషపడుతున్నారట.