ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పూర్తిగా యాక్టివ్ అయ్యారు. ఇదివరకటిలా కేవలం మాటల్తో సరిపెట్టకుండా చేతల్లో పనితనం చూపాలనుకుంటున్నారు. అందుకే డేగ కళ్ళతో జగన్ ను పరిశీలిస్తున్నారు. జగన్ తప్పటడుగు వేస్తే చాలు చెలరేగిపోవాలని చూస్తున్నారు. ఏడాదిన్నర పాలనలో జగన్ పట్ల ఎక్కేఎక్కడ అసంతృప్తి మొదలైంది, ఏయే వర్గాలు ఆయనకు వ్యతిరేకంగా తయారయ్యాయో కనుక్కుంటున్నారు. ఈ పరిశీలనలో ఆయన దృష్టిలో పడ్డది యువతే. యువతలో చాలావరకు జగన్ పాలన పట్ల సంతోషంగా లేరని, నిరాశతో ఉన్నారని చంద్రబాబు కనుగొన్నారట.
జగన్ ఎన్నికల ప్రచారంలో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకొచ్చి కొత్త ఉద్యోగాలు సృష్టిస్తామని హామీ ఇచ్చారు. యువత ఏ ప్రభుత్వం నుండైనా ఆశించే ప్రథమ అంశం ఇదే. జగన్ మాటలు నమ్మి ఎక్కువ శాతం యువత గత ఎన్నికల్లో వైసీపీకి జైకొట్టారు. చంద్రబాబు బాబు వస్తాడు.. జాబ్ ఇస్తాడు, ఇంటికో ఉద్యోగం అంటూ ఊదరగకొట్టి చివరికి ఏమీ చేయకపోవడంతో యువత గట్టిగా బుద్ధి చెప్పారు. పూర్తిస్థాయిలో జగన్ కు మద్దతిచ్చారు. అంతెందుకు ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో అధికార తెరాస ఓడిపోవడానికి ప్రధాన కారణం యువకులే. నిరుద్యోగం పెరిగిపోవడం, కొత్త అవకాశాలు లేకపోవడంతో యువత మొత్తం మూకుమ్మడిగా హ్యాండ్ ఇచ్చారు.
బీజేపీ సైతం యువతను తమ వైపుకు తిప్పుకోవడానికి ఈ నిరుద్యోగ సమస్యనే బాగా వాడుకుంది. ఇక జగన్ హయాంలో చూస్తే ఆయన ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థలో తప్ప కొత్తగా ఉద్యోగాలను సృష్టించింది లేదు. కొత్త కంపెనీలు, పరిశ్రమలు, పెట్టుబడులు రాలేదు. నిరుద్యోగ సమస్య అలానే ఉంది. దానికితోడు కరోనా మూలంగా ఎంతో మంది ఉద్యోగాలు, సొంత వ్యాపారాలను కోల్పోయారు. దీంతో నిరుద్యోగం మరింత పెరిగింది. దరిదాపుల్లో ఎక్కడా కొత్త ఉద్యోగాలు పుట్టే సూచనలు కనిపించట్లేదు. దీని చంద్రబాబు ప్రధానంగా ఎలివేట్ చేయాలని అనుకుంటున్నారు. సోషల్ మీడియాలో, ఎల్లో మీడియాలో, ఇకపై జరగబోయే పార్టీ కార్యక్రమాల్లో ఈ విషయాన్నే ఎత్తిచూపుతూ జగన్ నుండి యువతను వేరు చేయాలని చూస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని తక్కువగా అంచనా వేయడానికి లేదు.