రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్ట్ మీద జరుగుతున్న రాజకీయాలు అన్నీ ఇన్నీ కావు. ఈ ప్రాజెక్టును క్యాష్ చేసుకోవాలని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ పూర్తిచేయగలిగిన పార్టీకి ప్రజల్లో వచ్చే పేరు అంతా ఇంతా కాదు. ఎవరి హయాంలో అయితే ప్రాజెక్ట్ పూర్తవుతుందో వారిని రాష్ట్ర ప్రజలు కలకాలం గుర్తుపెట్టుకుంటారు. ఈ ఒక్క అంశమే రానున్న పదేళ్లలో ప్రభుత్వాలను డిసైడ్ చేసే అవకాశం ఉంది. అందుకే ఈ ప్రాజెక్ట్ మీద పార్టీలకు అంత ఆశ. అయితే ఆశ ఉంటే సరిపోదు కదా.. ప్రయత్నం కూడ ఉండాలి. పోలవరం మొదలైన దగ్గర్నుండి అధికారం కాంగ్రెస్, టీడీపీల నడుమ మారుతూ వచ్చింది. ఇప్పుడు వైసీపీ చేతికి వచ్చింది. వైఎస్ జగన్ చూస్తే పోలవరాన్ని పూర్తిచేయాలనే తపనతోనే ఉన్నారు కానీ కేంద్రం సహకరించట్లేదు.
55 వేల కోట్ల అంచనా వ్యయాన్ని 23 వేల కోట్లకు కుదించారు. ఈ నిధులతో ప్రాజెక్ట్ పూర్తిచేయడం అసంభవం. కానీ వచ్చే రెండేళ్లలో ప్రాజెక్ట్ పూర్తిచేసి తీరుతామని వైసీపీ ప్రభుత్వం బల్లగుద్ది చెబుతోంది. ఇదే చంద్రబాబుకు భయాన్ని పుట్టిస్తోంది. ఎందుకంటే జగన్ సామాన్యుడు కాదు. చెప్పింది చేసి చూపించే రకం. మొదట్లో రెవెన్యూ లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రంలో వేళా కోట్లతో సంక్షేమ పథకాలను ఎలా అమలుచేయలేరని అందరూ అనుకున్నారు. చంద్రబాబు నాయుడైతే ఆదాయం లేని, అప్పుల్లో మునిగిన రాష్ట్రాన్ని చూసి మొదటి ఏడాదిలోనే జగన్ నీరుగారిపోవడం ఖాయమని అనుకున్నారు. కానీ జగన్ అనూహ్యంగా 50 వేల కోట్లకు పైగానే సంక్షేమాన్ని చేసి చూపించారు. అలాంటి వ్యక్తి పోలవరాన్ని ఈజీగా వదలడనే నమ్మకం ఏర్పడిపోయింది బాబుగారికి.
పైపెచ్చు అది దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ప్రాజెక్ట్. ఆ సెంటిమెంట్ కోసమైనా జగన్ చేసి తీరుతారు. ఇక కొత్తగా పోలవరం ముందు 150 అడుగుల ఎత్తున వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని జగన్ సంకల్పించారు. అందుకు 250 కోట్లు కేటాయించారు. అదే గనుక జరిగితే పోలవరం క్రెడిట్ పూర్తిగా జగన్ వశమైపోతుంది. అప్పుడిక ఆయన్ను ఆపడం చంద్రబాబు తరం కాదు. ఇన్నేళ్లు పోలవరాన్ని 70 శాతం పూర్తిచేసింది మేమే, భవిష్యత్తులో 100 శాతం చేయగలిగేది కూడ మేమే అంటూ గొప్పలు చెబుతూ వచ్చిన చంద్రబాబుకు ఇకపై ఆ అవకాశం కూడ ఉండదు. ఒకవేళ ఈ దఫాలో జగన్ పూర్తిచేయలేకపోయినా, 2024లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయి పూర్తిచేసినా కూడ క్రెడిట్ సగం రాజశేఖర్ రెడ్డి ఖాతాలోకి వెళ్ళిపోతుంది.
ఎందుకంటే ప్రాజెక్ట్ వద్ద ఆయన నిలువెత్తు విగ్రహం ఉంటుంది కాబట్టి. ఎలాగూ పోలవరానికి ఆధ్యుడు ఆయనే కాబట్టి విగ్రహం ఉండటం వలన అది వైఎస్ఆర్ మానసపుత్రిక అయిపోతుంది. అప్పుడు ఎంత కష్టపడి కట్టినా పూర్తి ప్రయోజనం చంద్రబాబుకు దక్కదు. ఒకవేళ జగన్ హయాంలోనే ప్రాజెక్ట్ పూర్తయితే ఎన్ని ఎత్తులు వేసినా పోలవరం మీద టీడీపీ ముద్ర పడే అవకాశం ఉండనే ఉండదు. గతంలో చేసిన పనులు కూడ వృథా అవుతాయి. అందుకే జగన్ వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయకుండా అడ్డుకునేందుకు ఎన్ని చేయాలో అన్నీ చేస్తున్నారు చంద్రబాబు. ప్రస్తుతం విమర్శలు గుప్పుస్తూ వస్తున్న ఆయన వీలైతే భవిష్యత్తులో కోర్టులకు వెళ్లి విగ్రహం ఏర్పాటు మీద స్టే తెచ్చినా తెచ్చుకుంటారు.