ఏపీలో ప్రస్తుతం తిరుమల డిక్లరేషన్ వివాదం రాజుకుంది. ఎవరి నోట చూసినా తిరుమల డిక్లరేషన్ గురించే చర్చిస్తున్నారు. అసలు తిరుమలకు అన్యమతస్తులు వెళ్తే డిక్లరేషన్ ఇవ్వాలా? వద్దా? అనేది ప్రస్తుతం పెద్ద డిబేట్ అయింది. అయితే.. అది కాస్త ఇఫ్పుడు సీఎం జగన్ వైపు టర్న్ అయింది.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం జగన్ తిరుమలకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం జగన్ తిరుమల టూర్ పై స్పందించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమలకు జగన్ ఎలా వెళ్తారంటూ ప్రశ్నించారు.
డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే సీఎం జగన్ తిరుమల శ్రీవారి ఆలయంలో అడుగుపెట్టాలని ఆయన అన్నారు. వేరే మతానికి చెందిన దేశాధ్యక్షుడే డిక్లరేషన్ ఇచ్చి ఆలయంలోకి అడుగు పెట్టారని… ఎందరో కేంద్ర మంత్రులు డిక్లరేషన్ ఇచ్చారని… మరి.. ఏపీ సీఎం జగన్ కు డిక్లరేషన్ ఇస్తే వచ్చిన సమస్య ఏంటో అర్థం కావడం లేదన్నారు.
సీఎం జగన్ ఇలా చేస్తే.. అది రాష్ట్రానికే అరిష్టం. బ్రహ్మోత్సవాల్లో ఆయన ఒంటరిగా వెళ్లి శ్రీవారికి పట్టువస్త్రాలు ఇవ్వడం ఆయనతో పాటుగా రాష్ట్రానికి కూడా అరిష్టమే.. అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఎవరు ఏ మతంలో ఉన్నా సరే… వేరే మతాన్ని కించపరచకూడదు. చట్టపరంగా ఎన్నికైన ముఖ్యమంత్రి ఇలా చట్టాన్ని ఉల్లంఘించడం కరెక్ట్ కాదని చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ లో పార్టీ నేతలకు తెలిపారు. హిందూ దేవుళ్ల పట్ల ఏపీ సీఎం జగన్, వైసీపీ శ్రేణులు చేస్తున్న అపచారాలకు టీడీపీ శ్రేణులు మొత్తం నిరసన తెలపాలని చంద్రబాబు ఆదేశించారు.