ఆ విషయంలో చంద్రబాబును చూసి జగన్ నేర్చుకోవాల్సిందే..!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో సాధించిన అద్భుత విజయం ఏపీ రాజకీయాల్లో ఓ సెన్సేషన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండేళ్ల పదవీకాలం కూడా పూర్తి కాబోతోంది. కరోనా సమస్యల వలయంలో కూడా సంక్షేమ పథకాలను అందిస్తూ పాలనలో తన మార్కు చూపిస్తున్నారు. మరొక్క ఏడాది గడిస్తే.. 2024 ఎన్నికలకు సమయాత్తం కావాల్సిందే. అయితే.. 2019 విజయం పునరావృతం కావాలంటే జగన్ పద్ధతిలో మార్పు రావాల్సిందే. ఎందుకంటే ప్రస్తుతం ఆయన అనుసరిస్తున్న బాట మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పోలి ఉండటమే. రాజకీయాలను పరిశీలిస్తున్న ఎవరికైనా ఇదే సందేహం రాక మానదు. ఈ పద్ధతి సరైంది కాదనే చెప్పాలి.

చంద్రబాబు నాయుడు ఎప్పుడూ నాయకుల్ని, క్యాడర్ ను, క్షేత్రస్థాయి పరిస్థితులను నమ్మరు. అడ్మినిస్ట్రేషన్ పై పట్టు ఉండటంతో అధికారులు ఇచ్చే ర్యాంకింగ్సే ఆయనకు కావాలి. రియల్ టైమ్ గవర్నెన్స్ పేరుతో ఆయన రాష్ట్రం మొత్తం పరిస్థితులను బేరీజు వేసుకునేవారు. పథకాల అమలు, నాయకుల తీరు, ప్రజల సంతృప్తి.. ఇవన్నీ ర్యాంకుల్లోనే చూశారు. ఈనెల్లో ఇంత ర్యాంకు ఉందంటే.. వచ్చే నెలలో ఒక శాతం పెరిగినా ధీమాగానే ఉండేవారు. నాయకులు, కార్యకర్తలు మాటలు విని.. ‘అన్నీ నాకు తెలుసు..’ అనేవారు. ఆ మాటే కొంప ముంచిందని ఓటమి తర్వాత అనుకున్న నాయకులూ ఉన్నారు. అంటే క్షేత్రస్థాయిలో ప్రజల పరిస్థితులను ఆయన గ్రహించలేదు. ఇప్పుడు జగన్ చేస్తున్నదీ అదే అని చెప్పాలి. నాయకులను కలుపుకుని వెళ్తున్నారా అనేదే ప్రశ్న.

 

జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో నేతలు, కార్యకర్తలను భాగస్వాములను చేయాలి. క్షేత్రస్థాయిలో ప్రజల ఆలోచను నాయకుల ద్వారా తెలుసుకోవాలి. ఈ రెండేళ్లలో ఒక్కసారీ పార్టీ నేతలతో మమేకమైంది లేదు. ఇటివలి పరిస్థితులు అందుకు ఒక ఉదాహరణ. ప్రతిపక్ష నాయకుల తీరును వారు ప్రజల్లోకి వెళ్తున్న విధానం తెలియాలన్నా స్థానిక నాయకత్వమే చెప్పగలదు. ఇవన్నీ సీఎం జగన్ ఇప్పటినుంచే చేయాలి. కరోనా పరిస్థితులు కూడా సీఎంకు అడ్డొచ్చాయి. రెండేళ్ల పాలనలో ఏడాదిన్నరగా ఇదే పోరు. రచ్చబండ కూడా జరగలేదు. ఇవన్నీ జగన్ కు అడ్డొచ్చినా ఇకపై చంద్రబాబు చేసిన తప్పిదాన్ని చూసైనా స్థానిక  నాయకులు, కార్యకర్తలతో మమేకమైతే జగన్ లక్ష్యానికి తిరుగులేనట్టే..!