కుప్పంలో ఓడిపోతానని బాబు భయపడుతున్నారా.. అక్కడినుంచి పోటీ అంటూ?

2024 ఏపీ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఎవరూ కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. కుప్పంలో పోటీ చేస్తే ఎన్నికల్లో ఓడిపోతానేమోనని చంద్రబాబు సైతం భయపడే పరిస్థితి నెలకొంది. కుప్పంలో రోజురోజుకు వైసీపీ పుంజుకుంటుకున్న నేపథ్యంలో చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో విశాఖలోని టీడీపీ అనుకూల నియోజకవర్గాలలో ఒక నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోనున్నారని తెలుస్తోంది.

ఏపీ సీఎం వైఎస్ జగన్ విశాఖ ఏపీ రాజధాని కావాలని కోరుకుంటున్న సంగతి తెలిసిందే. ఏపీలో వైసీపీ బలహీనంగా ఉన్న జిల్లాలలో విశాఖ ఒకటి కావడంతో విశాఖను రాజధానిగా చేయడం వల్ల అక్కడి ప్రజల మనస్సులను గెలుచుకోవచ్చని జగన్ భావిస్తున్నారు. అయితే చంద్రబాబు మాత్రం విశాఖ నుంచి పోటీ చేయడం ద్వారా సీఎం అయితే విశాఖను మరింత అభివృద్ధి చేస్తానని ప్రజలకు అభిప్రాయం కలిగేలా చేయాలని అనుకుంటున్నారు.

జగన్ విశాఖను రాజధాని చేయగా చంద్రబాబు జగన్ ప్లాన్ కు రివర్స్ ప్లాన్ చేయడం గమనార్హం. అయితే కుప్పంను వదులుకుని మరో నియోజకవర్గంలో చంద్రబాబు పోటీ చేసి ఓడిపోతే మాత్రం చంద్రబాబు పొలిటికల్ కెరీర్ కు ఇబ్బంది అని చెప్పవచ్చు. విశాఖపై తనకు ఉన్న ప్రేమను చేతల్లో చూపించాలని చంద్రబాబు భావిస్తున్నారని సమాచారం అందుతోంది. తెలుగుదేశంకు విశాఖ సేఫెస్ట్ జోన్ అని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు.

గత ఎన్నికల్లో విశాఖలో టీడీపీ 4 స్థానాలలో విజయం సాధించింది. రాయలసీమలోని 4 జిల్లాలలో టీడీపీ కేవలం 3 స్థానాలలో విజయం సాధించగా విశాఖలో మాత్రం ఏకంగా 4 స్థానాలలో విజయం సాధించడం గమనార్హం. విశాఖ నుంచి బాబు పోటీ చేస్తానని అధికారికంగా వెల్లడిస్తే వైసీపీ రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది. టీడీపీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి సాయశక్తులా కృషి చేస్తోంది.