Chandrababu Mark Smiling : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయమై రాష్ట్ర హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు నేపథ్యంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వికటాట్టహాసం చేస్తున్నారు. ‘నేను చెప్పానా.. నేను చెప్పానా..’ అంటూ మీడియా ముందుకొచ్చి, ‘ధర్మమే గెలిచింది.. న్యాయమే గెలిచింది.. అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని. అద్భుతంగా అమరావతిని నిర్మిద్దామనుకున్నాం.. దాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాశనం చేశారు..’ అంటూ వ్యాఖ్యానించేశారు చంద్రబాబు.
చంద్రబాబు వికటాట్టహాసంలో (Chandrababu Mark Smiling) వింతేమీ లేదు. ఆయన అలాగే స్పందిస్తారు కూడా. అయితే, అమరావతి విషయంలో చంద్రబాబు చేసిన పాపాన్ని ఎలా విస్మరించగలం.? ‘సంక్షోభంలో అవకాశాల్ని వెతుక్కోవడమెలాగో నాకు బాగా తెలుసు..’ అంటూ, అమరావతి విషయంలో పదే పదే చంద్రబాబు చెబుతూ వచ్చేవారు.. ఇంకా చెబుతూనే వున్నారు.
నిజమే, రాష్ట్ర విభజన అనే సంక్షోభం నుంచి అమరావతిని నిర్మించే అవకాశాన్ని దక్కించుకున్నారు చంద్రబాబు. అయితే, ఆ అమరావతిని సంక్షోభంగా మార్చేసి, దాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు దోచుకునేందుకు అవకాశంగా చంద్రబాబు మార్చారన్న విమర్శలు లేకపోలేదు.
మాజీ మంత్రి నారాయణ ఎక్కడ.? ఆయనే కదా, రాజధాని అమరావతి పేరుతో పబ్లిసిటీ స్టంట్లు చేసింది. చంద్రబాబు, నారాయణ మాత్రమే కనిపించారు అమరావతి విషయంలో. అప్పట్లో, అమరావతి నిర్మాణానికి సంబంధించి కీలకంగా వ్యవహరించాల్సిన చాలామంది మంత్రులు సైడయిపోయారు. ఉప ముఖ్యమంత్రులు సైతం చేవలేనివాళ్ళలా తయారైపోయారు.. నారాయణ దెబ్బకి.
సినీ దర్శకుడ్ని విదేశాలకు పంపి, అమరావతి డిజైన్ల చుట్టూ యాగీ చేసింది చంద్రబాబు కాక ఇంకెవరు.? తన హయాంలో రాజధానికి సంబంధించి తొలి ఫేజ్ పూర్తి చేయాల్సిన చంద్రబాబు, అసంపూర్తిగా రాజధాని నిర్మాణాన్ని చేపట్టి.. మమ అనిపించేయడమే ఇప్పుడు ఇన్ని అనర్ధాలకీ కారణం.